జ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు
logo
Published : 23/06/2021 16:50 IST

జ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు

హైదరాబాద్‌: నాగోలులోని జ్యోతిష్యుడి ఇంట్లో రంగురాళ్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. రంగురాళ్లతో పాటు కొంత నగదు చోరీ అయ్యాయని బెల్లంకొండ మురళీకృష్ణశర్మ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... పోలీసులు జరిపిన విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుచూశాయి. మురళీకృష్ణ శర్మ ఇంట్లో పోలీసులు భారీగా నగదు గుర్తించారు. దాదాపు రూ.18కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ.6లక్షల నగదు లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. మురళీకృష్ణశర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని గుర్తించిన పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసుకు సంబంధించి చోరీకి పాల్పడిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము చోరీ చేసిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించామని, ఆతర్వాత వాటిని తగులబెట్టామని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నకిలీ నోట్లు ఇంట్లోకి ఎలా వచ్చాయనే దానిపై.. ఫిర్యాదుదారు మురళీకృష్ణ శర్మను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు వ్యవహారం వెలుగు చూసింది. గతంలో మురళీకృష్ణపై సీబీఐ కేసు నమోదైనట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. హవాలా మనీ కేసులో గతంలో మురళీకృష్ణ జైలుకు వెళ్లి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వివిధ ఛానెళ్లలో ప్రకటనలు ఇచ్చి పలువురికి నకిలీ రంగురాళ్లు విక్రయించినట్లు గుర్తించారు. మురళీకృష్ణశర్మ నలుగురు అనచరులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

గతంలో విశాఖపట్నంలో కనస్ట్రక్షన్‌కు సంబంధించిన ట్రేడింగ్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మురళీకృష్ణ తన వద్ద రూ.90కోట్ల నగదు ఉన్నట్టు చూపించారు. కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మల్కాజ్‌గిరిలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు అధికారుల సాయంతో నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి నగదు బదిలీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మురళీకృష్ణతో పాటు నలుగురు బ్యాంకు అధికారులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత మురళీకృష్ణశర్మ నాగోలులో నివాసం ఉంటున్నారు. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన మురళీకృష్ణ కోట్ల రూపాయల స్కామ్‌లు, నకిలీనోట్లు, రంగురాళ్ల మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని