లక్షల యూనిట్లు ఏమైనట్లు
logo
Published : 24/06/2021 05:24 IST

లక్షల యూనిట్లు ఏమైనట్లు

విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌లో అవకతవకలు

డిస్కం అంతర్గత తనిఖీలో గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయా? కొందరు సిబ్బంది డిస్కం ఆదాయానికి భారీగా గండికొడుతున్నారా? విద్యుత్తు సంస్థ అంతర్గతంగా చేపట్టిన మీటర్‌ చెకింగ్‌లో అవుననే తేలింది. నాన్‌ ఐఆర్‌(ఇన్‌ఫ్రా రెడ్‌) పోర్టు మీటర్లను ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

3 వేలు పరిశీలిస్తేనే..

గ్రేటర్‌లో 53 లక్షలకుపైగా విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. ప్రతినెలా మొదటివారంలో సిబ్బంది ఇంటికి వచ్చి బిల్లులు జారీ చేస్తుంటారు. మీటర్‌ రీడింగ్‌లో తప్పులకు అవకాశం లేకుండా పాత మీటర్ల స్థానంలో ఇన్‌ఫ్రా రెడ్‌ మీటర్లను దశలవారీగా వినియోగదారుల ఇళ్లలో బిగించారు. ఇప్పటివరకు పలు సర్కిళ్లలో 98 శాతంపైగానే ఈ మీటర్లతోనే బిల్లింగ్‌ చేస్తున్నారు. సిబ్బంది మీటర్‌కు సమీపంలో రీడింగ్‌ యంత్రం చూపెట్టగానే.. నమోదు చేసుకుని బిల్లు జారీ అవుతుంది. ఈ విధానంలో చాలావరకు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అయితే సాంకేతిక కారణాలతో ఐఆర్‌ పోర్టు మీటర్‌ ఉన్నా మాన్యువల్‌గానే ప్రతినెలా వేల సర్వీసులు బిల్లులు జారీ చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పటికీ కొన్ని నాన్‌ ఐఆర్‌ పోర్టు మీటర్లు ఉన్నాయి. పాతబస్తీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి అన్ని సర్కిళ్లలో కలిపి లక్ష పైగానే ఉంటాయని అంచనా. ఇక్కడ సిబ్బంది మీటర్‌లో రీడింగ్‌ చూసి యంత్రంలో నమోదు చేస్తే అప్పుడు బిల్లు వస్తుంది. కొందరు సంవత్సరాల తరబడి అవకతవకలకు పాల్పడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో డిస్కం నష్టాలు అధికంగా ఉన్న ఫీడర్ల పరిధిలోని కొన్ని సెక్షన్లలో తనిఖీ చేయించింది. మాన్యువల్‌ బిల్లింగ్‌తోపాటు అందివచ్చిన టెక్నాలజీతో మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేసే విధానంలో పోల్చి చూసింది. 3వేల నాన్‌ ఐఆర్‌ పోర్టు మీటర్లలో లక్ష యూనిట్లు తక్కువ బిల్లింగ్‌ అయినట్లు గుర్తించారు. కొందరు సిబ్బంది వాస్తవంగా వినియోగదారుడు కాల్చిన విద్యుత్తు కంటే తక్కువ బిల్లు వచ్చేలా చూస్తున్నారు. అందుకు పెద్ద మొత్తం తీసుకుని తమ జేబులు నింపుకొంటున్నారు. ఇక్కడ ప్రతినెలా పెద్ద ఎత్తున డిస్కంకు గండి పడుతోంది. ఇప్పటి వరకు ఆ యూనిట్లను పంపిణీ నష్టాల ఖాతాలో చూపుతున్నారు.

ఆదాయం తగ్గడంపై గుర్రు..

కచ్చితమైన బిల్లింగ్‌ లేకపోవడానికి తోడు గృహ విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని వాణిజ్య, ఇతర కేటగిరీలకు వాడకంతో డిస్కం రెవెన్యూ బాగా తగ్గింది. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ అధికారుల పనితీరుపై ఇటీవల సమీక్షలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నష్టాలను తగ్గించి ఆదాయం పెంచాలని సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని