శంషాబాద్‌లో భారీగా ఐఫోన్లు స్వాధీనం
logo
Published : 25/06/2021 01:19 IST

శంషాబాద్‌లో భారీగా ఐఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో రూ. కోటికి పైగా విలువైన 80 ఐఫోన్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులతోపాటు వారి నుంచి ఐఫోన్‌లు తీసుకునేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ బెల్ట్‌ వద్ద నుంచి లగేజీ తీసుకుని బయటకు వెళ్లే సమయంలో తనిఖీలు నిర్వహించి ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జేఎస్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అవన్నీ పన్నులు చెల్లించకుండా అక్రమంగా తీసుకొచ్చిన ఐఫోన్లుగా గుర్తించినట్లు చెప్పారు.

స్వాధీనం చేసుకున్న వాటిలో ఐఫోన్‌ 12ప్రో, ఐఫోన్‌ 12ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌గా పేర్కొన్నారు. ఈ మొబైల్స్‌ ఒక్కొక్కటి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర విలువ చేస్తాయని చెప్పారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 80 ఐఫోన్ల విలువ దాదాపు రూ. 1.65 కోట్లుగా ఉంటుందని చంద్రశేఖర్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు గుజరాత్‌కు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు హైదరాబాద్‌ జగదీష్‌ మార్కెట్‌కు చెందిన వారని సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని