పడకలున్నా.. పలుకులేదు
eenadu telugu news
Updated : 06/07/2021 06:32 IST

పడకలున్నా.. పలుకులేదు

 విషజ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు

 గాంధీ, టిమ్స్‌, ఇతర ఆస్పత్రుల్లో మొదలుకాని సాధారణ వైద్యం

 ప్రైవేటుకు పరుగులు పెడుతున్న పేదలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

డెంగీ, మలేరియా లాంటి అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న పేద రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి రావడం లేదు. దీనికి కారణం గాంధీ, టిమ్స్‌లాంటి అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు మొదలుపెట్టకపోవడమే. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రోగులు తగ్గిపోవడంతో వీటికి చికిత్స అందిస్తున్న నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 2896 పడకలు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత ఆస్పత్రుల్లో సాధారణ రోగాలకు చికిత్స అందించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

మొదటి దశ కరోనా తీవ్రత తగ్గిన వెంటనే గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో వెంటనే సాధారణ రోగులకు వైద్యం మొదలుపెట్టారు. అదే రెండో దశలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గిపోయినా కూడా ఆస్పత్రులన్నింటిని ఖాళీగానే ఉంచుతున్నారు తప్ప సాధారణ రోగాలకు వైద్యం అందించే విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. గాంధీలో 1711 పడకలు ఖాళీగా ఉన్నాయి. రోజువారీ వచ్చే బ్లాక్‌ఫంగస్‌, కరోనా రోగుల సంఖ్య 40 వరకు ఉంటోంది. ఇందులో 70 శాతం ఫంగస్‌ కేసులే ఉంటున్నాయి. లైబ్రరీ భవనంలో దాదాపు 250 పడకలున్నాయి. కరోనా రోగులను అక్కడికి తరలించి మిగిలిన పడకల్లో సాధారణ రోగులకు వైద్యం అందించడానికి అవకాశం ఉంది. మరో ముఖ్యమైన గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిలో కూడా ప్రస్తుతం 80 మంది కరోనా రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కింగ్‌కోఠి, ఫీవర్‌, ఛాతి ఆస్పత్రుల్లో కూడా వందలాది పడకలు ఖాళీగానే ఉన్నాయి.

ఒక్క రోగి లేకుండానే..

ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో దాదాపు 250 పడకలుంటే అన్నీ ఖాళీగానే ఉన్నాయి. పాతబస్తీలోని మరో ఆయుర్వేద ఆస్పత్రి, అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పక్షవాతం రోగులకు చక్కటి వైద్యం అందుతోంది. అనేకమంది రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చినా కరోనా చికిత్స మాత్రమే చేస్తున్నామంటూ తిప్పి పంపుతున్నారు.

స్పందించని వైద్య ఆరోగ్య శాఖ

రెండు వేల పడకలతో ఉన్న ఉస్మానియా ఆస్పత్రితోపాటు నిమ్స్‌ ఆస్పత్రి సాధారణ రోగులతో నిండిపోయాయి. నిమ్స్‌లో కొన్ని విభాగాల్లో రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో కొత్తగా వచ్చే వారిని చేర్చుకోవడం లేదు. ఉస్మానియాకు పంపిస్తున్నారు. అక్కడా రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం డెంగీ కేసుల సంఖ్య పెరిగాయి. మొన్నటి వరకు పూర్తిగా కరోనా వైద్యాన్ని అందించిన ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే సాధారణ వ్యాధులకు చికిత్స మొదలుపెట్టాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఆ దిశగా చర్యల్లేవు. దీంతో విష జ్వరాలతో ప్రైవేటులో చేరి రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తోందని అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ, టిమ్స్‌ తదితర ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం అందించే విషయంలో చర్యలు తీసుకునేలా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించాలని కోరుతున్నారు.

రోగుల సంఖ్య 300కు తగ్గితే...:

- ప్రభాకర్‌రెడ్డి, నోడల్‌ అధికారి, గాంధీ ఆస్పత్రి

గాంధీలో కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య 300లకు తగ్గితే సాధారణ వైద్యం అందించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అనేక పడకలు ఖాళీగా ఉన్నా సాధారణ రోగులకు వైద్యం అందించమని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం 120 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. దానిపై దృష్టిపెట్టాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని