శృంగార వల.. చిక్కితే విలవిల
eenadu telugu news
Updated : 07/07/2021 04:37 IST

శృంగార వల.. చిక్కితే విలవిల

ఫేస్‌బుక్‌ ద్వారా యువకులకు వల వేస్తున్న సైబర్‌ నేరస్థులు

ఈనాడు, హైదరాబాద్‌: అవధుల్లేని ఆనందాన్ని ఆస్వాదిద్దాం... పరిమితుల్లేని శృంగారం మీ సొంతం అంటూ వాట్సప్‌ కాల్స్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ ఆపై వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా నేరస్థుల గుట్టురట్టయ్యింది. అంతర్జాలంలోని అశ్లీల వీడియోలను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని.. వాటికి వాయిస్‌ఛేంజ్‌ యాప్‌ను జోడించి... మాట్లాడుతున్న నేరస్థుల వివరాలు, సాక్ష్యాధారాలను హైదరాబాద్‌ పోలీసులు సేకరించారు. రాజస్థాన్‌కు చెందిన.. పదోతరగతీ పాస్‌కాని వీరు ఇప్పటికే వేల మందిని బెదిరించి రెండు నెలల్లో రూ.25 కోట్లకుపైగా కొల్లగొట్టారని, 18 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థులయ్యారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు, చెన్నై, ముంబయి పోలీసులు వీరి కోసం వేటాడుతున్నారు. ఈ క్రమంలో వీరిలో 18 మందిని ఇటీవలే హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నేరాల చిట్టాను తెలుసుకునేందుకు విచారించనున్నారు.

మీరూ నగ్నంగా మాట్లాడండి.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన నేరస్థులు ఫేస్‌బుక్‌ ద్వారా మెట్రోనగరాల్లోని యువకులు, వృత్తినిపుణులను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజులు ఫేస్‌బుక్‌ ద్వారా మాట్లాడిన తర్వాత వారి వాట్సప్‌ నంబర్లు తీసుకుంటున్నారు. ఇక అప్పటి నుంచి మోసాలకు తెరతీస్తున్నారు. వాట్సప్‌ కాల్‌ మొదలైన నిమిషానికే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతున్నారు. ఇదంతా సాంకేతిక మాయాజాలం.. సెల్‌ఫోన్‌లో అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న అశ్లీల వీడియోను ప్రదర్శిస్తూ వాయిస్‌ ఛేంజ్‌ యాప్‌ ద్వారా అమ్మాయిలా మాట్లాడుతున్నారు. ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడాక.. మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ అభ్యర్థిస్తున్నారు. అలా సాధ్యం కాదని చెప్పినా.. పదేపదే, వీడియోకాల్‌ చేస్తున్నారు.

బాధితులు వీడియోకాల్‌ చేయడం మొదలు పెట్టగానే.. ముఖం కనిపించాలంటూ కోరుతున్నారు. మరో కెమెరాతో బాధితుడి మాటలు, దృశ్యాలను రికార్డు చేస్తాడు. వీడియోకాల్‌ పూర్తైన ఐదు నిముషాలకు.. బాధితుడు మాట్లాడిన వీడియోను పంపి.. దీన్ని సామాజిక మాధ్యమాల్లో పెడతామని, తాము అడిగినంత ఇవ్వాలని బెదిరిస్తున్నారు. బాధితులు భయభ్రాంతులకు గురై నేరస్థులు చెప్పిన ఖాతాల్లో నగదు జమచేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని