దేశంలో నియంతృత్వ పాలన: రాజనర్సింహ
logo
Published : 22/07/2021 14:00 IST

దేశంలో నియంతృత్వ పాలన: రాజనర్సింహ

ఫోన్‌ హ్యాకింగ్‌పై ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ధర్నా

హైదరాబాద్‌: దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. ప్రశ్నిస్తే 124ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంలో ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్‌ చేసిందని రాజనర్సింహ ఆరోపించారు. ఫోన్‌ హ్యాకింగ్‌ మన దేశం చేస్తోందా? శత్రుదేశం చేస్తోందా? అని ప్రశ్నించారు. ఐటీ, ప్రైవసీ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయపి.. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం ‘చలో రాజ్‌భవన్‌’ పేరిట ర్యాలీ నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్లనున్నారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్‌ నేతలు మల్లు రవి, ఫిరోజ్‌ఖాన్‌, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని