మృత్యువు తరుముకెళ్లింది
eenadu telugu news
Updated : 24/07/2021 12:17 IST

మృత్యువు తరుముకెళ్లింది

దిండి వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురి మృతితో ఉలిక్కిపడిన నగరం 

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మల్కాజిగిరి, నిజాంపేట, జీడిమెట్ల

నాగర్‌కర్నూల్‌ జిల్లా దిండి వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘోరరోడ్డు ప్రమాదంలో మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన శివకుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. చెన్నారంగేట్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో ఏడుగురు హైదరాబాద్‌ వాసులు మృతి చెందారన్న సమాచారంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. వీరిలో హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంకు ఒక కారులో వెళుతున్న వారు నలుగురు ఉండగా, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు మరో కారులో వస్తున్న వారు ముగ్గురు ఉన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతుల వివరాలు తెలిశాయి. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌, అతడి తల్లి సుబ్బలక్ష్మి, బంధువు వెంకటమూర్తి, పదిహేనేళ్ల బాలుడు లవమూర్తి చనిపోయారు. ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌లో శివకుమార్‌ నివాసముంటున్నాడు. సహోద్యోగి భాస్కర్‌ వద్ద కారు తీసుకొని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శివకుమార్‌, సుబ్బలక్ష్మి, వెంకటమూర్తి, లవమూర్తి కారులో శ్రీశైలం బయలుదేరారు. వారు టోల్‌గేట్లు దాటిన వరకు భాస్కర్‌కు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. తర్వాత ఆగిపోయాయి. భాస్కర్‌కు అచ్చంపేట ఎస్సై ఫోన్‌ చేసి చెప్పినప్పుడు ప్రమాద విషయం తెలిసింది.

చెప్పకుండా వెళ్లారు.. కడుపు కోత మిగిల్చారు..

కుటుంబ సభ్యులకు చెబితే తమ సరదా ప్రయాణానికి అభ్యంతరం చెబుతారని భావించి వారికి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. నిజాంపేటకు చెందిన తలారీ వెంకటేష్‌ (28) స్థానిక వాటర్‌ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఇతనికి పేట్‌బషీరాబాద్‌ నివాసి వంశీకృష్ణ (28), ఆనంద్‌బాగ్‌కు చెందిన కార్తీక్‌, అమీన్‌పూర్‌లోని గండిగూడెం నివాసి నరేష్‌ స్నేహితులు. భారీ వర్షాలకు నిండిన శ్రీశైలం డ్యాం చూడటానికి గాను ఈ నలుగురు కలిసి గురువారం మధ్యాహ్నం కారులో బయలుదేరారు. వంశీకృష్ణ కారులో మిగతా ముగ్గురిని ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. రాత్రికి శ్రీశైలంలో బస చేశారు. శుక్రవారం స్వామి దర్శనం చేసుకుని డ్యాంను సందర్శించారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్‌ మినహా వెంకటేష్‌, వంశీ, కార్తీక్‌లు దుర్మరణం పాలయ్యారు. వెంకటేష్‌ అవివాహితుడు. తల్లిదండ్రులు అతనికి వివాహం చేసే ప్రయత్నంలో ఉండగా.. ప్రమాదం పొట్టన పెట్టుకోవడంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ప్రమాదానికి గురైన కారు వెంకటేష్‌ పేరుతోనే ఉండటం గమనార్హం. జీడిమెట్లకు చెందిన ముప్పిడి వంశీకృష్ణ(28) కూడా ఇంట్లో తల్లికి చెప్పకుండానే వెళ్లాడు. తండ్రి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. వంశీ మృతి విషయం తల్లికి తెలియకుండా జాగ్రత్త పడినా.. టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారం కావడంతో ఆ తల్లికి విషయం తెలిసి.. కన్నీరుమున్నీరవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని