ఆదుకున్నారు.. శస్త్రచికిత్స చేయించారు
eenadu telugu news
Published : 24/07/2021 03:54 IST

ఆదుకున్నారు.. శస్త్రచికిత్స చేయించారు

వైద్యులతో జయకుమార్‌షా, ప్రకాశ్‌షా

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: సాయం కోరి అర్థించగానే స్పందించారో యువతి. తెలిసిన వారంతా ఆమెతోపాటు తలోచేయి వేశారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ కలిసి రావడంతో.. అంతా కలిసి ఒకరికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయమందించారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన ప్రకాశ్‌షా(51) కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. మార్పిడి చేస్తే తప్ఫ. బతకలేని పరిస్థితి. తన కాలేయంలోని కొంత ఇచ్చేందుకు కుమారుడు జయకుమార్‌షా సిద్ధమైనా, శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు రూ.లక్షల్లో ఉండటంతో దిక్కుతోచక ఉన్నారు. నగరంలోని ఓ ఆసుపత్రికి వైద్యానికి వస్తున్నారు తప్పితే, వారికి మరో మార్గం కనిపించలేదు.

ఈనెల 6న ఆపరేషన్‌... బోయిన్‌పల్లికి చెందిన సంజనా రహేజా నగరంలో ఐటీ ఉద్యోగిగా ఉన్నారు. తన తండ్రి మనోజ్‌ రహేజాతో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వారి సేవలు తెలుసుకున్న ప్రకాశ్‌షా కుమార్తె షాన్‌కుమారి.. జూన్‌ 6న సంజనాను సంప్రదించారు. తన స్నేహితులు, ఇతర బంధువుల వద్ద రూ.1.5 లక్షలు సేకరించి ఇచ్చారు. మరింత సాయంకోసం సోనూసూద్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి గోవింద్‌ అగర్వాల్‌ను సంప్రదించగా.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి వెళ్లమన్నారు. శస్త్రచికిత్సకు రూ.23.5 లక్షలు కాగా.. 30 శాతం ఆ ఫౌండేషన్‌ భరించింది. వైద్యులతో సంప్రదింపులూ జరిపింది. ఈనెల 6న కాలేయమార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. కాలేయదానం చేసిన కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు సంజనా తెలిపారు. దాత అనిల్‌రజానీ రూ.1.50 లక్షలు సాయం చేసి షా కుటుంబం ఉండేందుకు తాత్కాలికంగా తన ఫ్లాట్‌ ఇవ్వడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని