జంట జలసంగమం
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

జంట జలసంగమం

బాపూఘాట్‌ వద్ద భారీ వరద ప్రవాహం

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ వరద కలిసేది ఇక్కడే

ఈసీ, వసీ నదులు ఒక్కటై.. దిగువకు ప్రవాహం

జంట జలాశయాల సంగమమిది. రెండు నదులు ఈసీ, మూసీ కలిసే పవిత్రమైన చోటు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌(గండిపేట) నుంచి వేర్వేరుగా వస్తున్న వరద బాపూఘాట్‌ వద్ద సంగమంగా మారుతోంది. దీంతో ఈ ప్రాంతమిప్పుడు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడే కాదు ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని స్థానికులు చెబుతున్నారు. సంగం అని పిలుస్తు..ఏటా ఇక్కడ జాతర కూడా చేస్తుంటారు. పర్యాటక కేంద్రంగా మరింతగా అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

భారీ వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో వరసగా రెండో ఏడాది జంట జలాశయాల గేట్లు ఎత్తారు. ఉస్మాన్‌సాగర్‌ సామర్థ్యం 1790 అడుగులకు(3.90టీఎంసీలు) గాను ప్రస్తుతం 1786 వద్ద(2.937 టీఎంసీలు) నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండగా ముందస్తుగా గేట్లు ఎత్తి మూసీలోకి వదిలారు. గండిపేట, నార్సింగి, మంచిరేవుల, లంగర్‌హౌస్‌ ప్రాంతాల మీదుగా వరద దిగువకు ప్రవహిస్తోంది. హిమాయత్‌నగర్‌ 1763.50 అడుగులకు(2.97 టీఎంసీలు) గాను 1761.75 అడుగులు(2.715టీఎంసీలకు) నీటిమట్టానికి చేరుకుంది. మొన్నటివరకు 1200 క్యూసెక్కుల వరకు ఎగువ నుంచి వరద రావడంతో ఈసీ నదిలోకి వదులుతున్నారు. రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, బుద్వేల్‌, హైదర్‌గూడ ప్రాంతాల మీదుగా ఈసీ నది ప్రవహిస్తోంది. రెండు జలాశయాల నుంచి వస్తున్న వరద బాపూఘాట్‌ వద్ద కలవడంతో ప్రవాహం ఎక్కువగా ఉంది.అయితే గత రెండుమూడు రోజులుగా వర్షాలు తెరిపినివ్వగా జలాశయాల గేట్లు కొన్ని మూసేయడంతో బాపూఘాట్‌ వద్ద వరద ప్రవాహం తగ్గింది. వారాంతంలో ఇక్కడి జల సంగమాన్ని వీక్షించేందుకు సందర్శకులు పెద్దఎత్తున వస్తున్నారు.

బాపూఘాట్‌

బాపు జ్ఞాపకంగా..

రెండు నదులు కలిసే పవిత్రమైన సంగమం కావడంతో జాతిపిత మహాత్మాగాంధీ అస్తికలను ఇక్కడ నిమజ్జనం చేశారు. దేశవ్యాప్తంగా 11 చోట్ల అస్తికలను నిమజ్జనం చేయగా.. అందులో ఇదొకటి. 1948 ఫిబ్రవరి 12న ఇక్కడికి తీసుకొచ్చి నదిలో కలిపారు. ఆ తర్వాత జ్ఞాపకంగా 68 ఎకరాల్లో బాపూఘాట్‌ కట్టారు. మొదట్లో ఇక్కడ మూసీపై వంతెన లేదు. కొద్ది సంవత్సరాల క్రితమే నిర్మించారు. వంతెనకు ఒకవైపు బాపూఘాట్‌, మరోవైపు తపోవనం పార్కు ఉంటాయి. ఇక్కడ పర్యాటకంగా మరింత అభివృద్ధికి అవకాశం ఉన్నా నీటిపారుదలశాఖ, పర్యాటక శాఖ దృష్టిపెట్టకపోవడంతో ఆక్రమణలు పెరుగుతున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చాలాకాలంగా చెబుతున్నా ఇంకా కాగితాలపైనే ప్రాజెక్టు ఉంది.


అక్కడ సందర్శకుల నిరాశ..

గండిపేట జలాశయం ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా బాగా ప్రసిద్ధి. డ్యామ్‌పైకి వెళ్లి సరదాగా గడిపేవారు. అక్కడి పార్కులోనూ సేదతీరేవారు. ప్రస్తుతం జలాశయం నిండి.. గేట్లు ఎత్తడంతో చూసేందుకు వెళ్లిన సందర్శకులకు నిరాశే ఎదురవుతోంది. చాలా ఏళ్లుగా డ్యామ్‌పైకి సందర్శకులను అనుమతించడం లేదు. హిమాయత్‌సాగర్‌ వద్ద ఇదే పరిస్థితి. రక్షణ చర్యలు చేపట్టి సందర్శకులను అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. డ్యామ్‌పైకి అనుమతి లేకపోయినా.. డ్యామ్‌ కింద వనాలను అభివృద్ధి చేసి అక్కడి వరకు అనుమతించాలని సూచిస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ వద్ద కొండలపైన వ్యూపాయింట్‌ ఏర్పాటు చేస్తే ఇదొక పర్యాటక కేంద్రంగా మారుతుందని సందర్శకులు అంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని