జిల్లా జడ్జి సమక్షంలో దంపతుల సమావేశం
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

జిల్లా జడ్జి సమక్షంలో దంపతుల సమావేశం

పిటిషనర్‌కు సీపీ పూర్తి భద్రత కల్పించాలి

హెబియస్‌ కార్పస్‌పై సుప్రీం ఆదేశం

ఈనాడు, దిల్లీ: సంక్లిష్టంగా మారిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఓ కొలిక్కి తెచ్చింది. హైదరాబాద్‌ వస్తే తన ప్రాణానికి ముప్పుందని పిటిషనర్‌ భయపడడంతో ఆయనకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పూర్తి భద్రత కల్పించాలని ఆదేశించింది. తన భార్యను అత్తమామలు హైదరాబాద్‌లోని ఇంట్లో బందీగా ఉంచారంటూ పంజాబ్‌ మొహాలికి చెందిన సచిన్‌ సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, వారం వ్యవధిలో రెండు సార్లు విచారణ చేపట్టింది. జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా సోమవారం మరోమారు విచారించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రుతంజయ భరద్వాజ్‌ వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌ హైదరాబాద్‌ వెళ్లే పరిస్థితి లేదు. అతని భార్యను ముంబయికి తరలించండి’’ అని కోరారు. ఎనిమిది నెలల గర్భిణి విషయంలో ఆ సాహసం తాము చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసు రక్షణ కల్పిస్తారా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది బీనా మాధవన్‌ను ధర్మాసనం ప్రశ్నించగా ఆమె అంగీకరించడంతో తీర్పు వెలువరించింది. ‘‘పిటిషనర్‌ సచిన్‌ ఈనెల 31న హైదరాబాద్‌ వెళ్లాలి. జిల్లా జడ్జి లేదా జిల్లా జడ్జి నియమించిన న్యాయమూర్తి సమక్షంలో ఆయన ఛాంబర్‌లో పిటిషనర్‌ తన భార్యను కలిసి మాట్లాడాలి. జడ్జి తప్ప ఆసమయంలో మరెవరూ ఉండకూడదు. దంపతులిద్దరూ కలిసి ఉంటామని విజ్ఞప్తి చేస్తే అందుకు అనుమతించాలి. తాత్కాలిక వసతికి అయ్యే వ్యయాన్ని పిటిషనర్‌ భరించాలి.’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని