మాతా శిశు సంరక్షణలో నిర్లక్ష్యం తగదు
eenadu telugu news
Published : 29/07/2021 00:57 IST

మాతా శిశు సంరక్షణలో నిర్లక్ష్యం తగదు

పాలనాధికారిణి పౌసుమిబసు

వైద్యాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని పాలనాధికారిణి పౌసుమి బసు వైద్యాధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం సమావేశం మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి ఉన్నవారిని గుర్తించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు వారికి సేవలను అందించాలన్నారు. 61 కుష్ఠు కేసులను గుర్తించారని, 13 మందికి చికిత్స జరపగా వ్యాధి నుంచి బయట పడ్డారని తెలిపారు. 9 డెంగీ కేసులు నమోదు చేయగా వారికి వైద్య సేవలను అందించారని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సీజనల్‌ వ్యాధులు తగ్గాయని తెలిపారు. జిల్లాలో మధుమేహం ఉన్న వారు 9,604 మంది, అధిక రక్తపోటు 19 వేల మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులు జరిగే విధంగా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ విషయంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌ షిండే, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ జీవరాజ్‌, డాక్టర్లు లలిత, అరవింద్‌, మారియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని