ఒకేసారి మొత్తం రుసుం వసూలు చేస్తారా?
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

ఒకేసారి మొత్తం రుసుం వసూలు చేస్తారా?

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేయడంతో పాటు కళాశాల పేరుతో కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఫిట్‌జీ లిమిటెడ్‌ సంస్థపై జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.4,35,458.90 తిరిగి చెల్లించడంతో పాటు రూ.50వేల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.10వేలు, 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన ఎస్‌.శ్రీనివాస్‌.. ఫిట్‌జీ సంస్థ ప్రకటనలు చూసి తన కుమారుడికి ఐఐటీ/జేఈఈలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. సైఫాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లి సంప్రదించి అడ్మిషన్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019 జనవరిలో రెండు సంవత్సరాల ఫీజు చెల్లించారు. తర్వాత ట్యాబ్‌ కోసం రూ.7,493 వసూలు చేశారు. 2019 జూన్‌ 19న తరగతులను ప్రారంభించారు. రెండురోజులు తరగతులకు హాజరైన ఎస్‌.శ్రీనివాస్‌ కుమారుడు కోచింగ్‌ సెంటర్‌ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సాధారణ అడ్మినిస్ట్రేషన్‌ ఫీజు మినహాయించుకుని మిగతా డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ జూన్‌ 22న సంస్థ ప్రతినిధులను ఆయన అభ్యర్థించారు. రీఫండ్‌ కుదరని చెప్పారు. తీవ్ర మానసికవేదనకు గురైన శ్రీనివాస్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా కమిషన్‌-2 బెంచ్‌ వినియోగదారుల వాదనలతో ఏకీభవించింది. ఫిర్యాదుదారు నుంచి వసూలు చేసిన ఫీజులో రూ.10వేలు మినహాయించుకుని మిగిలిన మొత్తం తిరిగి చెల్లించడంతో పాటు పరిహారం, కేసు ఖర్చులు చెల్లించాలని ప్రతివాద ఫిట్‌జీ లిమిటెడ్‌ సంస్థను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని