‘హుజూరాబాద్‌లో దళిత బంధు ఆగస్టు 15లోపు ఇవ్వాలి’
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

‘హుజూరాబాద్‌లో దళిత బంధు ఆగస్టు 15లోపు ఇవ్వాలి’

పోరాటంలో కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తున్న దళిత సంఘాల నేతలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్‌ లోపే పూర్తి చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఆగస్టు 1 నుంచి 15వ తేదీలోపు పథకం నగదును అక్కడి ప్రతి దళిత కుటుంబానికి చెల్లించాలన్నారు. లేని పక్షంలో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో ఎస్సీ సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో.. ఎస్సీల సమగ్ర అభివృద్ధి సాధన సదస్సు జరిగింది. రాష్ట్ర బేడ బుడగ జంగాల అధ్యక్షుడు చింతల రాజలింగం అధ్యక్షతన జరిగిన సదస్సులో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నెల రోజుల్లో దళితుల ఓట్లు గంపగుత్తగా వేయించుకుని గెలిచేందుకు కేసీఆర్‌ డ్రామాలకు తెర లేపారని, దళిత జాతి అయన్ను ఒక్క శాతం కూడా నమ్మే పరిస్థితి లేదని అన్నారు. దళిత బంధు సాధించుకునేందుకు ఆగస్టు ఒకటి నుంచి రోజుకు రెండేసి ఉమ్మడి జిల్లాల్లో సభలు ఉంటాయని, ఈ వేదికపై ఉన్న ప్రతినిధులంతా పాల్గొంటారని అన్నారు. అగస్టు 16న ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించి సెప్టెంబరు 5 నాటికి హుజూరాబాద్‌ చేరుకుని దళిత గర్జన ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యులు రాములు, దళిత నేత జేబీ రాజు, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ తదితర అనేక దళిత సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని