ఇంధన మాఫియా గుట్టు రట్టు
eenadu telugu news
Updated : 29/07/2021 01:44 IST

ఇంధన మాఫియా గుట్టు రట్టు

జీహెచ్‌ఎంసీకి చిల్లు పెట్టిన ముఠా
స్వాధీనం చేసుకున్న ట్యాంకర్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీ వాహనాలకు ఇంధన సరఫరా చేసే గుత్తేదారు సహకారంతో ఉపగుత్తేదారు, మరో ఆరుగురితో కలిసి ఇంధనాన్ని దారి మళ్లించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిసి రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ వాహనాలకు డీజిల్‌ సరఫరా చేసే గుత్తేదారుగా అమీర్‌పేట్‌కు చెందిన అయూబ్‌అలీబేగ్‌ వ్యవహరిస్తున్నాడు. అతడి వద్ద మాజీ నౌకాదళ అధికారి, ప్రకాశం జిల్లా కుర్రవానిపాలేనికి చెందిన నాదెండ్ల కోటేశ్వరరావు సబ్‌కాంట్రాక్టు పొందాడు. జీహెచ్‌ఎంసీ ఏఈ, డీఈలు జారీచేసే కూపన్లు తీసుకొని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తున్నాడు. అన్నోజిగూడకు చెందిన బోధ వేణుమాధవరావు, బండరావిరాలలోని బీఎన్‌ఆర్‌ స్టోన్‌ క్రషర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే అనుగు సుధాకర్‌రెడ్డి, చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్‌అవాయిస్‌, ఉప్పల్‌కు చెందిన కొత్తూరు వెంకటయ్య, ట్యాంకర్‌ లారీ యజమాని అశోక్‌రెడ్డితో కలిసి మూడు నెలల నుంచి జీహెచ్‌ఎంసీ వాహనాల్లో 5వేల లీటర్లు పోసి మొత్తం నింపినట్లు చూపుతూ మిగిలిన 15వేల లీటర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం 15వేల లీటర్ల డీజిల్‌ ఇంధనంతో ఉన్న ట్యాంకర్‌ను బండరావిరాలలోని బీఎన్‌ఆర్‌ స్టోన్‌ క్రషర్‌లోకి తీసుకొని వెళ్లిన ముఠా కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి కోటేశ్వరరావును, వేణుమాధవరావును, సుధాకర్‌రెడ్డిని, మహమ్మద్‌ అవాయిస్‌, వెంకటయ్యలను అరెస్టుచేశారు. 15 వేల లీటర్ల ఇంధనంతో ఉన్న ట్యాంకర్‌ను, రూ.23వేల నగదు, 6 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని షకీల్‌, అశోక్‌రెడ్డి, అయూబ్‌అలీబేగ్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈకేసులో ఏ8గా ఉన్న గుత్తేదారు అయూబ్‌అలీబేగ్‌ పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు, విచారణ అనంతరం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ముఠా మూడు నెలలుగా సమర్పించిన రికార్డులను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీకి ఎంత నష్టం కలిగించారో తేలనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని