నిర్లక్ష్యపు నిప్పు భగ్గుమంది
eenadu telugu news
Published : 29/07/2021 02:16 IST

నిర్లక్ష్యపు నిప్పు భగ్గుమంది

జీడిమెట్ల నాసెన్స్‌ ల్యాబ్‌లో పేలిన రియాక్టర్‌

ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

జీడిమెట్ల, న్యూస్‌టుడే : రసాయన పరిశ్రమలో సంభవించిన భారీ విస్ఫోటనంతో ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. బుధవారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్‌-2లోని నాసెన్స్‌ ల్యాబ్‌లో ఉదయం 7.45గంటలకు రియాక్టర్‌ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టు పక్కల ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కమ్ముకొస్తున్న పొగల నుంచి మంటలతో పరుగులు పెడుతున్న కార్మికులతో ఆ ప్రాంతమంతా భీతావాహ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన షిఫ్ట్‌లో 54 మంది హజరయ్యారు. సోడియం, మిథనాయిల్‌ను మిక్స్‌ చేస్తున్న క్రమంలో 7.45 గంటలకు ఒక్కసారిగా బయిలర్‌ నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించేలోపే భారీ శబ్దం వచ్చింది. విధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి హరిప్రసాద్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. నందకిషోర్‌ కాలికి, అర్జున్‌ తలకు గాయాలయ్యాయి. జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బల్దియా నార్త్‌జోన్‌ అగ్నిమాపక అధికారి సుధాకర్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీనివాస్‌రెడ్డి, బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం జీడిమెట్ల సీఐ బాలరాజు పరిస్థితిని సమీక్షించారు.

ఫస్ట్‌ షిఫ్ట్‌కొచ్చి ప్రమాదంలోకి..

హరిప్రసాద్‌రెడ్డి(42) రోజు జనరల్‌ షిఫ్ట్‌కు వస్తారు. బుధవారం ఉదయం 6 గంటల షిఫ్ట్‌కు వచ్చారు. రసాయనం మిక్స్‌ చేస్తున్న క్రమంలో బయిలర్‌ ఆగిపోయింది. పరిశీలించే లోపే భారీ శబ్దం వచ్చింది. హరిప్రసాద్‌ అక్కడే ఉండడంతో తీవ్రంగా గాయపడినట్లు కార్మికులు చెబుతున్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు.

నిపుణులుండరు.. మంటలార్పరు!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, జీడిమెట్ల, న్యూస్‌టుడే: కనీస జాగ్రత్తలు పాటించని యాజమాన్యాలు, మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరించే కొందరు అధికారుల వల్ల పేద కార్మికుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో జరిగిన భారీ ప్రమాదాలు యంత్రాంగం నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు అగ్గిపుల్ల వెలగకూడని చోట వెల్డింగ్‌ పనులు చేయడం, రసాయనాలు కలిపే సమయంలో జరిగే ప్రతిచర్యలను నియంత్రించలేని కార్మికుల్ని విధుల్లో ఉంచడం ఇలా చిన్నచిన్న నిర్లక్ష్యాలు నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. బుధవారం జరిగిన ఘటనలో రసాయనాలు కలుపుతున్నప్పుడు జరిగే ప్రతిచర్యను నియంత్రించే సామర్థ్యమున్న నిపుణులు లేక పరిస్థితి విషమించిందని కార్మికులే చెబుతున్నారు. తక్కువ జీతాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కార్మికుల్ని పనుల్లో ఉంచుకొని యాజమాన్యాలు చేస్తున్న తప్పులే కార్మికుల ప్రాణాల్ని బలిగొంటున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మంటలు చెలరేగితే ఆర్పేందుకు సమీపంలో ఫైర్‌ స్టేషన్లుండాలి. కానీ, కొన్నిచోట్లే ఆ వసతి ఉంది. అలా కాకుండా పరిశ్రమల్లోనూ ఫైర్‌ ఫిట్టింగ్‌, భద్రతా వ్యవస్థ ఉండాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని