Hyderabad News: ఒంటరి మహిళలే లక్ష్యం... ప్రతిఘటిస్తే కిరాతకంగా హత్య
eenadu telugu news
Published : 29/07/2021 20:13 IST

Hyderabad News: ఒంటరి మహిళలే లక్ష్యం... ప్రతిఘటిస్తే కిరాతకంగా హత్య

హైదరాబాద్‌: ఒంటరి మహిళలే ఆ దంపతుల లక్ష్యం. బంగారం, వెండి ఆభరణాల కోసం కిరాతకానికి పాల్పడేవారు. ప్రతిఘటిస్తే అత్యంత కిరాతకంగా హత్య చేస్తారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లేబర్‌ అడ్డా వద్ద ఓ మహిళ అపహరణ, హత్యోదంతం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గతంలో వీరి నేర చరిత్రపై ఆరా తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్‌ డీసీపీ పద్మజ మీడియాకు వెల్లడించారు. దుండిగల్‌ ఠాణా పరిధిలో కూలిపని చేసుకునే భామిని హత్యకేసులో నిందితులు స్వామి, నర్సమ్మను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వికారాబాద్‌కి చెందిన కురువ స్వామి ఐడీఏ బొల్లారంలో డ్రైవర్‌గా, కూలీగా పనిచేస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం పరిచయమైన నర్సమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరితో పాటు నర్సమ్మకు చెందిన ఇద్దరు పిల్లలు కూడా ఉంటున్నారు. కల్లు, మద్యానికి బానిసలైన ఇద్దరూ.. కూలి డబ్బులు సరిపోక చోరీలకు తెరలేపారు. ఒంటరి మహిళలు కనిపిస్తే వారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, వారి వద్ద ఉన్న బంగారం, వెండి దోచుకోవడం పరిపాటిగా మారింది. చోరీ చేయడంతో పాటు ఆ మహిళలపై లైంగిక వాంఛ తీర్చుకోవడం కురువ స్వామి నైజం. ఇందుకు అతనితో ఉండే నర్సమ్మ కూడా సహకరించేది. అందులో భాగంగానే ఈనెల 25న మల్లంపేట కూలీల అడ్డా వద్ద భామినిని గమనించారు. ఆమె నచ్చడంతో తీసుకు వెళ్లేందుకు నర్సమ్మతో పథకాన్ని చెప్పాడు స్వామి. అప్పటికే ఉదయం 10.30గంటలు కావడంతో ఇక ఆరోజు పని దొరకదని భావించిన భామిని భర్త సోమనాథ్‌ ఆమెను ఇంటికి వచ్చేయమన్నాడు. కానీ, ఏదో ఒక పని దొరికితే కాసిని డబ్బులు వస్తాయని భావించిన భామిని మరో మహిళతో కలిసి అక్కడే ఉండిపోయింది. ఇంతలో.. గుట్టపై ఉన్న గుడికి రంగులు వేసే పని ఉందంటూ స్వామి, నర్సమ్మలు రూ.700ల కూలీ మాట్లాడుకుని ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.

ద్విచక్రవాహనంపై భామినిని జిన్నారం మండలం మాధారం సమీపంలో ఉన్న అగ్గిరాళ్ల గుట్ట వద్దకు తీసుకెళ్లారు. నడవటానికి కూడా వీలులేని గుట్టపైకి తీసుకెళ్తుండగా భామిని వారిని ఇంకా ఎంత దూరం అని ప్రశ్నించింది. కొద్దిగా పైకి వెళితే గుడి ఉంటుందని చెప్పారు. అప్పటికే అలసిపోవడంతో తాను భోజనం చేస్తానని భామిని వారికి చెప్పింది. అనంతరం.. తనకు ఆరోగ్య సమస్య ఉందని, తన భర్త కోరికను తీర్చలేకపోతున్నానని, అందుకు నువ్వు సహకరించాలని నర్సమ్మ భామినిని కోరింది. భామిని అందుకు నిరాకరించింది. కూలి పనికోసం మాత్రమే వచ్చానని తేల్చి చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరూ భామినిని బలవంతంగా కింద పడేశారు. కాళ్లు, చేతులు నర్సమ్మ పట్టుకోగా... స్వామి ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పటికీ భామిని గొడవ చేస్తుండటంతో పక్కనే ఉన్న కర్రతో ఆమెపై  తీవ్రంగా దాడి చేశాడు. సాటి మహిళ అని కూడా చూడకుండా నర్సమ్మ కూడా దాడి చేసి గాయపరిచింది. భామిని వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, చరవాణి తీసుకుని ఆమెను పెద్ద బండరాళ్ల మధ్యలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. భామిని అదృశ్యంపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారరించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఘటనాస్థలంలో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. వారి నుంచి రూ.2లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గతంలో జిన్నారం, శంకరపల్లి, అమీన్‌పూర్‌ పరిధిలో దోపిడీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకుంటామని డీసీపీ పద్మజ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని