పేదింటి ముంగిట ఉన్నత విద్య
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

పేదింటి ముంగిట ఉన్నత విద్య

జిల్లాకు కొత్తగా రెండు డిగ్రీకళాశాలలు

 నెరవేరిన దశాబ్దాల కల

 తల్లిదండ్రుల, విద్యార్థుల ఆనందం


పరిగిలోని ప్రభుత్వ జూ.కళాశాల

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌: ‘వికారాబాద్‌, పరిగి నియోజక వర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కావాలి. తమ పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలి. వారు ఆర్థికంగా ఎదగాలి.’ ఇది జిల్లా పేదింటి, మధ్య తరగతి తల్లిదండ్రుల, విద్యార్థుల కల. ఒకనాటిది కాదిది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వారు ప్రతి ప్రజా ప్రతినిధికి ఈ విషయమై విన్నవిస్తూనే ఉన్నారు ఎట్టకేలకు ప్రభుత్వం ఈ రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ఆమోదించింది. దీంతో ఇన్నాళ్లకు తమకల నెరవేరిందని జిల్లా వాసులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...


తరగతి గదిలో విద్యార్థులు

నిరంతరం ఎన్నెన్నో కష్టాలు

వికారాబాద్‌ జిల్లా ఏర్పడి ఏడేళ్లయింది. అంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది. డిగ్రీ చదివేందుకు విద్యార్థులు తాండూరు, కొడంగల్‌, మొయినాబాద్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు వికారాబాద్‌, పరిగి నుంచి వెళ్లాల్సి వచ్చేది. ప్రత్యేక జిల్లాగా వికారాబాద్‌ ఏర్పడినా కొత్తగా డిగ్రీ కాలేజీలు మంజూరు కాలేదు. పూర్తి గ్రామీణ ప్రాంతం, కూలీలు, పేదలే ఎక్కువగా ఉండటంతో నానా కష్టాలు పడుతూ పిల్లలు ఉన్నత చదువుల కోసం తాపత్రయ పడేవారు. విద్యార్థులు సకాలంలో బస్సులు అందక, డబ్బులు వెచ్చించి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. మధ్యాహ్న భోజనానికీ ఇబ్బందులే. ఖాళీ కడుపుతో అలాగే అవస్థ పడేవారు. మరికొందరు సమీపంలో ఉన్న ఐటీఐ, ఇతర సాంకేతిక చదువులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపే వారు. ఇక ఆడపిల్లలనైతే ఇన్ని బాధలు పడటం కుదరదని తల్లిదండ్రులే మధ్యలో మాన్పించే వారు. చొరవచూపి పూర్తిగా చదివేది కొద్ది మందే ఉండేవారు. ఆర్థికంగా ఉన్న వారు, ఖర్చయినా భరించక తప్పదని మధ్యతరగతి వారు తమ పిల్లలను ప్రైవేటుగా డిగ్రీ చేర్పించే వారు.

*● ప్రసుత్తం జిల్లాలో కేవలం 9 మాత్రమే ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలుండగా 42 ప్రైవేటువి ఉన్నాయి. ప్రతి యేటా ఉత్తీర్ణులు అయ్యేవారి 60 శాతంపైౖగా ఉంటుంది.

* జిల్లాకు కొత్తగా మంజూరైన డిగ్రీ కళాశాలల్లో ఒకటి వికారాబాద్‌ జిల్లా కేంద్రం, మరొకటి పరిగి పట్టణంలో ఏర్పాటు కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం (2021-22)నుంచే ఈ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి.

పరిగి, న్యూస్‌టుడే: పరిగి నియోజకవర్గంలోని దోమ, పరిగిలో మాత్రమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల ఉంది. పట్టణంలో మరో మూడు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి ఏటా సుమారు 3 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. వీరిలో కేవలం వందల మంది మాత్రమే తాండూరు, కొడంగల్‌ ప్రభుత్వ కళాశాలలపై ఆధారపడుతుంటే మిగతా వారికి ప్రైవేటు సంస్థలే ఆధారంగా నిలుస్తున్నాయి.

ఇప్పటికి సాకారమైంది: వెంకటయ్య, వికారాబాద్‌

పిల్లలను డిగ్రీ చదివించాలంటే ఆర్థికంగా అగచాట్లు పడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ఇప్పటికి మా కల నెరవేరింది.

మంచి అవకాశం కలిగింది

- వినయ్‌, వెంకటేశ్వర్‌ నగర్‌ కాలనీ, విద్యార్థి

డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడంతో అందులో చేరుతాను. ఉచితంగా ఉన్నత విద్య చదివేందుకు అవకాశం కలిగింది. మా స్నేహితులూ అందులో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

- శంకర్‌నాయక్‌, జిల్లా నోడల్‌ అధికారి

ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు అవకాశం లభించింది. గ్రామీణ ప్రాంతంలో ఫీజులు కట్టి ప్రైవేటుగా చదవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తాజా నిర్ణయంతో ఉచితంగా ఉన్నత విద్యను చదవొచ్ఛు

ఆసక్తి చూపుతారు

- డ్టాక్టర్‌, రవీందర్‌, తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌

ప్రైవేటులో డిగ్రీ చేయాలంటే పేదింటి పిల్లలకు కష్టంగా ఉంటోంది. తాజా మార్పులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు అధిక ఆసక్తి చూపుతారు. తాండూరు డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం 400కు పైగా విద్యార్థులు ప్రతి సంవత్సరం చేరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని