అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 01/08/2021 03:09 IST

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు


నిందితుల నేరాలను వివరిస్తున్న సీపీ అంజనీకుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై ముంబయి నుంచి హైదరాబాద్‌కొచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గుర్ని మారేడ్‌పల్లి పోలీసులతో కలిసి ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.10 లక్షల బంగారు వెండి ఆభరణాలు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు, సీఐ కె.నాగేశ్వరరావులతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర పుణెకు చెందిన అజ్మీర్‌సింగ్‌ కల్యాణి(38) 2005 నుంచి చోరీలు చేస్తున్నాడు. పుణె హడాప్సార్‌ గ్రామానికి చెందిన కారుడ్రైవర్‌ అక్షయ్‌ ఫోపట్‌ పడులా(26) ఇతని అనుచరుడు. రాజస్థాన్‌, కుషిప్‌ తాలుకా, పదరాది కలన్‌ గ్రామానికి చెందిన విక్రమ్‌సింగ్‌ రాజ్‌పుత్‌ పుణెలో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతను చోరీ సొత్తును కరిగించి అమ్మేస్తాడు.జులై 6న అక్షయ్‌ బైకుపై సంగారెడ్డి చేరుకొన్నాడు. బస్సు, రైలు ద్వారా మరుసటి రోజు అజ్మీర్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరంలో ఇద్దరూ కలుసుకుని రెక్కీ నిర్వహించారు. మారెడ్‌పల్లి ఠాణా పరిధిలో రెండు ఇళ్లు, కాచిగూడ, అంబర్‌పేట్‌లలో దొంగతనాలు చేశారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పుణెకు వెళ్లి చోరీ సొత్తును అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అజ్మీర్‌సింగ్‌, ఫోపట్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే చోరీలను అంగీకరించారు. విక్రమ్‌సింగ్‌ రాజ్‌పుత్‌ను కూడా పట్టుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని