భూ అయస్కాంత క్షేత్రాల పరిశోధన కీలకం
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

భూ అయస్కాంత క్షేత్రాల పరిశోధన కీలకం


మాగ్నటో మీటర్‌ను పరిశీలిస్తున్న సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి మాండే

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: భూమి చుట్టూ ఆవరించి ఉన్న భూ అయస్కాంత క్షేత్రాల అధ్యయనం నిరంతరం సాగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ సి మాండే తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మందోల్లగూడెం శివారులోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ వేదశాల ప్రాంగణంలో కెనడా, డెన్మార్క్‌ సాంకేతిక సహాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన భూమ్యయస్కాంత క్షేత్రాల అదనపు అబ్జర్వేటరీని శనివారం ఆయన ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలోని జియో థర్మల్‌, మాగ్నటిక్‌ అబ్జర్వేటరీ, భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ఏర్పాటుచేసిన సైస్మలాజికల్‌ అబ్జర్వేటరీలను ఆయన పరిశీలించారు. ఎన్జీఆర్‌ఐ ఇక్కడ నిర్వహిస్తున్న భూగర్భ పరిశోధనలో భాగంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు తీయించి నీటి వనరులను గుర్తించి తవ్వించిన చెరువును పరిశీలించారు. ఆ చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో మందోల్లగూడెంలో రైతులకు జరిగిన మేలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ శేఖర్‌ సి మండే మాట్లాడుతూ, సీఎస్‌ఐఆర్‌-ఎన్జీఆర్‌ఐల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని అబ్జర్వేటరీల్లో నిర్వహిస్తున్న భూమ్యయస్కాంత క్షేత్రాల పరిశోధన ఎంతో కీలకమైందని తెలిపారు. భూమిని ఆవరించి ఉన్న భూమ్యయస్కాంత క్షేత్రాలు సౌర తుపానుల నుంచి రక్షణగా ఉంటాయని చెప్పారు. వీటిలో హెచ్చుతగ్గులు వాతావరణంపై, ఉపగ్రహాల గమనంపై ప్రభావం చూపుతాయన్నారు. విశ్వంలోని మానవాళి మనుగడ భూమ్యయస్కాంత క్షేత్రాలపై ఆధారపడి ఉందన్నారు. దేశంలో వివిధ రకాల వైరస్‌ల వ్యాప్తిని గుర్తించడానికి, దిల్లీలో ఐఐజీబీ, సీసీఎంబీ పరిశోధనలు నిర్వహించడానికి సీఎస్‌ఐఆర్‌ సహకారం అందిస్తోందని తెలిపారు. టీకా తయారీలో భారత్‌ బయోటెక్‌కు, ఇతరులకు ఐఐసీటీ లేబోరేటరీ సహకరించిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌ తివారీ, శాస్త్రవేత్తలు గణేశ్‌, నందన్‌, అబ్జర్వేటరీ ఇన్‌ఛార్జి కుసుమిత అరోరా, కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని