కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీం బెంచ్‌ అవసరం
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీం బెంచ్‌ అవసరం

జస్టిస్‌ చల్లా కోదండరామ్‌

జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ను సత్కరిస్తున్న నాగేందర్‌, గాలి వినోద్‌కుమార్‌ తదితరులు

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి రీజినల్‌ బెంచ్‌ గానీ, శాఖ గానీ, అప్పీలు చేసుకునే అవకాశం గానీ కల్పించాల్సిన అవసరముందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నర కాలంలో వీటిని సాధించుకోవాలని కోరారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శనివారం దక్షిణ భారత న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 50 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూడు రోజులకోసారి ఒక కేసు పరిష్కారమవుతోందని, ఈ లెక్కన సదరు కేసులను పరిష్కరించేందుకు సుమారు 20 ఏళ్లు పడుతుందన్నారు. రీజినల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీంకోర్టుపై భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వామన్‌రావు, దక్షిణ భారత న్యాయవాదుల ఐకాస కన్వీనర్‌ ఎస్‌.నాగేందర్‌, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, వెంకటేశ్వరీ, డాక్టర్‌ రాజ్‌నారాయణ్‌ ముదిరాజ్‌, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని