ఊపిరితిత్తులకు పొగ
eenadu telugu news
Published : 01/08/2021 06:20 IST

ఊపిరితిత్తులకు పొగ

30-40 ఏళ్లకే క్యాన్సర్లు దాడి

ఎంఎన్‌జేకు వచ్చే కేసుల్లో 20-25 శాతం అవే

ఈనాడు, హైదరాబాద్‌

సురేష్‌ కార్పొరేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన ఒత్తిడితో తాత్కాలిక ఉపశమనం కోసం సిగరెట్‌ తాగడం మొదలెట్టారు. అది అలవాటుగా మారింది. రోజుకు రెండు ప్యాకెట్లు(20) కాల్చేవారు. ఇటీవల అతనికి దగ్గు ప్రారంభమైంది. మందులు వేసుకున్నా తగ్గలేదు. మూడు వారాలైనా అదే పరిస్థితి ఉండడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఊపిరితిత్తుల బారిన పడినట్లు గుర్తించారు. తొలి దశలో ఉండటంతో వెంటనే సిగరెట్లు మానేయాలని సూచించడంతోపాటు చికిత్సలు అందించారు. కొన్నాళ్ల తర్వాత సురేష్‌ నెమ్మదిగా కోలుకున్నారు.

గరంలో చాలామంది ధూమపానానికి బానిసలుగా మారి వ్యాధుల బారినపడుతున్నారు. ముఖ్యంగా సిగరెట్‌ ఊపిరితిత్తులకు పొగబెడుతోంది. నిత్యం 10-20 సిగరెట్లు కాల్చేవారు 50 శాతం, 30-40 వరకు తాగేవారు 80-90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దగ్గర ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాంపల్లిలోని ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో 20-25 శాతం ఊపిరితిత్తుల కేన్సర్లవారే ఉంటున్నారు. చిన్న వయసులోనే వ్యసనానికి అలవాటు పడటం ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఆగస్టు 1న ఏటా ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్‌ అవగాహన దినం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

నగరంలో ఊపిరితిత్తుల కేన్సర్లు పెరుగుతున్నాయి. సిగరెట్‌ అలవాటుతోపాటు వాయు కాలుష్యం ఇందుకు ప్రధాన కారణం. గ్రేటర్‌ వ్యాప్తంగా 60 లక్షలపైగా వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం 2000 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం నమోదవుతోంది. కాలుష్యం వల్ల పీల్చే గాలి ద్వారా సల్ఫర్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటివి ఊపిరితిత్తులకు చేరి రోగాలకు కారణమవుతున్నాయి. తీవ్రమైన బ్రాంకైటీస్‌, సీవోపీడీతోపాటు కేన్సర్లకు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మూడు వారాల కంటే ఎక్కవ దగ్గు కొనసాగడం, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో నొప్పి, గొంతు బొంగురు పోవడం, కఫంలో రక్తం వంటివి ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలు. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్ఛు ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


యువతలోనూ ..

-డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎన్‌జే ప్రభుత్వ కేన్సర్‌ ఆసుపత్రి

● చిన్నతనం నుంచే పొగతాగటానికి అలవాటు పడటంతో 35-40 ఏళ్లకే చాలామంది కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రికి ఏటా 400-500 మంది ఊపిరితిత్తుల కేన్సర్లకు చికిత్స తీసుకుంటున్నారు. ● ఎంఎన్‌జేలో డీఅడిక్షన్‌ సెంటర్‌ ఉంది. పొగ మానేయాలనుకునే వారికి ఇక్కడ ఉచిత కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ● ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకటి, రెండో దశలో ఉంటే చికిత్సలతో నియంత్రించే వీలుంది. ఎంఎన్‌జేలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ● పొగ అనేది నోటి కేన్సర్లకు కూడా కారణమవుతుంది. ఈ అలవాటు ఉన్నవారు తక్షణం మానేయడం మంచిది.


80 శాతం మంది ముదిరిన తర్వాత వస్తున్నారు

-డాక్టర్‌ విజయానందరెడ్డి, డైరెక్టర్‌, అపోలో ఆసుపత్రి

* ప్రతి 100 మంది కేన్సర్‌ రోగుల్లో 15-20 వరకు ఊపిరితిత్తుల వ్యాధితో వస్తున్నారు. ఇందులో 80 శాతం మంది 3-4 దశల్లో వైద్యులను సంప్రదిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారుతోంది.

* ధూమపానం, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌, అలెర్జీ బ్రోంకైటిస్‌ లేదా క్రానిక్‌ అబ్‌స్టక్ట్రీవ్‌ పల్మనరీ డిసీజ్‌ వంటి వాటితో సంబంధం ఉన్న లక్షణాలను తప్పుగా అంచనా వేయడం వల్ల కూడా వ్యాధి నిర్ధారణలో ఆలస్యమవుతోంది. లక్షణాలను తప్పుగా గుర్తించడం, సరైన నిర్ధారణ లేకపోవడం, ఎక్కువ వారాలపాటు సాధారణ యాంటీబయాటిక్‌ చికిత్సలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణలో జాప్యానికి మరో కారణం.

* కరోనా నేపథ్యంలో ఊరిపితిత్తుల కేన్సర్లపై అప్రమత్తంగా ఉండాలి. సిగరెట్‌ తాగేవారితోపాటు తాగని వారిలో కూడా ఈ తరహా కేన్సర్లు వస్తున్నాయి. వాయు కాలుష్యంతో ఇతర కారణాలు దోహదం చేసే వీలుంది.

* ఊపిరితిత్తుల కేన్సర్లలో 60-70 శాతం పురుషులు, 20-30 శాతం మంది స్త్రీలు ఉంటున్నారు. వీరిలో 15-20 శాతం మంది యువతే. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి బయటపడేది. పొగ తాగడం, కాలుష్యం తదితర కారణాలతో 30-40 ఏళ్ల లోపు యువతలో వ్యాధి కన్పిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని