తప్పులు.. తిప్పలు
eenadu telugu news
Published : 01/08/2021 06:19 IST

తప్పులు.. తిప్పలు

 దరఖాస్తు సమయంలోనే దోషాలు

  జనన, మరణ ధ్రువపత్రాల్లో సవరణకు పౌరుల అర్జీలు

ఈనాడు, హైదరాబాద్‌: పేరు, ఇంటి పేరును రాయడంలో దరఖాస్తుదారులు చేస్తోన్న పొరపాట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనన, మరణ ధ్రువపత్రాల విషయంలో చాలామంది తడబాటుకు గురవుతున్నారు. ధ్రువపత్రం వచ్చాక దోషాన్ని గుర్తించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేర్లను సరిచూసుకోకుండా దరఖాస్తు చేస్తుండటంతో సమస్య తలెత్తుతోందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. జనన, మరణ ధ్రువప్రతాల విషయంలో పౌరులు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తోంది. ఏటా 10 శాతం దరఖాస్తులు ధ్రువపత్రాల్లో పేరు సవరణకు వస్తున్నవే ఉంటున్నాయని పేర్కొంది.

పేరు నమోదులో జాగ్రత్త..

● దరఖాస్తులు మూడు రకాలుగా ఉంటాయి. జనన, మరణాలు ఇంట్లో, ఆస్పత్రిలో లేదా బయట జరుగుతుంటాయి. ఇంట్లో, బయట జరిగే జనన, మరణాల విషయంలో సంబంధిత బంధువులు లేదా కుటుంబ సభ్యులు ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల్లో పౌరులు పేర్లను తప్పుగా రాస్తున్నారు. ఆస్పత్రుల్లో జరిగే జననాలు, మరణాలకైతే.. సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు శిశువు తల్లిదండ్రుల వివరాలను లేదా మరణించిన వారి వివరాలను ఆన్‌లైన్లో జీహెచ్‌ఎంసీకి పంపిస్తారు.

● శిశువు జన్మించాక ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రుల వివరాలను అడుగుతారు. అప్పుడు ధ్రువపత్రంలో పేరు ఎలా ఉండాలో.. అలాగే రాయించాలి. రోగి విషయంలో అయితే.. దవాఖానాలో చేర్పిస్తున్నప్పుడే పేరును అచ్చు తప్పులు లేకుండా నమోదు చేయించుకోవాలి. మరణం సంభవిస్తే అదే పేరుతో బిల్లులు, ధ్రువపత్రాలు జారీ అవుతాయి. ఈ రెండు విషయాల్లో.. ఆస్పత్రి పంపించే వివారాలనే జీహెచ్‌ఎంసీ యథాతథంగా ఆమోదిస్తుంది. చాలామంది ఆస్పత్రుల్లో వివరాలను తప్పుగా నమోదు చేయించుకోవడంతో.. మరోసారి ఆస్పత్రుల ద్వారా పేరు సవరణకు దరఖాస్తులు చేస్తున్నారు.

బల్దియాలోనూ దోషులు!

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలోని ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలన్నింటి వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా సర్కిల్‌ కార్యాలయాలకు చేరుతాయి. వాటిని రిజిస్ట్రార్లుగా వ్యవహరించే సహాయ వైద్యాధికారులు ఆమోదించాలి. క్షేత్రస్థాయిలో అలా జరగట్లేదు. అధికారులు తమకు తీరిక లేదంటూ.. కిందిస్థాయి సిబ్బందికి ఆ పని అప్పగిస్తున్నారు. అదే అదనుగా కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్లు పేరులోని అక్షరాలను, జనన, మరణాల తేదీలను ఉద్దేశపూర్వకంగా మార్చి, దరఖాస్తుదారులను వేధిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. తామే సవరిస్తామంటూ పౌరుల నుంచి ముడుపులు వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.


తిరస్కరణకు స్వస్తి..

జనన, మరణాల నమోదుకు వచ్చే దరఖాస్తులను ఇకపై తిరస్కరించకూడదని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆస్పత్రులు, వ్యక్తిగతంగా పౌరుల నుంచి వచ్చే దరఖాస్తుల్లో వివరాలు పూర్తిగా లేకపోతే అధికారులు తిరస్కరించేవారు. ఎందుకు తిరస్కరించారనే కారణమూ చెప్పేవారు కాదు. దాని వల్ల ఆస్పత్రుల సిబ్బందితోపాటు పౌరులూ గందరగోళానికి గురై ముడుపులు సమర్పించేవారు. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్న లక్ష్యంతో అదనపు కమిషనర్‌ బానోత్‌ సంతోష్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాలు సరిగా లేకుంటే.. దరఖాస్తులను తిరస్కరించకుండా వెనక్కి పంపించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయించారు. వెనక్కి పంపడానికి కారణాలను తెలపడం తప్పనిసరి చేశారు. దరఖాస్తులను రోజుల తరబడి తొక్కిపెట్టే అధికారులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు మార్చారు.


ఏటా వచ్చే దరఖాస్తులు

 జననాలు: 1.5 లక్షల నుంచి 1.7 లక్షలు

 మరణాలు: 45 వేల నుంచి 50 వేలు

 పేర్ల సవరణకు వచ్చేవి: 10శాతం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని