కొత్త చట్టం.. అక్రమాలు నేలమట్టం
eenadu telugu news
Published : 01/08/2021 03:09 IST

కొత్త చట్టం.. అక్రమాలు నేలమట్టం

వేరే సర్కిల్‌ అధికారులతో కూల్చివేతలు

స్థానిక యంత్రాంగంపై తగ్గిన రాజకీయ ఒత్తిడి


బీఎన్‌రెడ్డినగర్‌లో జేసీబీతో అక్రమ నిర్మాణం కూల్చివేత

నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు జీహెచ్‌ఎంసీ అధికారులు నూతన చట్టంతో చెక్‌పెడుతున్నారు. ముందుగానే గుర్తించిన అక్రమ నిర్మాణాలను సంబంధిత సర్కిల్‌ అధికారులతో కాకుండా పక్క సర్కిల్‌ అధికారులను పంపి కూల్చివేయిస్తున్నారు. దీంతో స్థానిక సర్కిల్‌ అధికారులపై ఎలాంటి ఒత్తిడిలు రాకుండా చూస్తున్నారు. గత నెలన్నర రోజులుగా నగరంలో దాదాపు 120 అక్రమ నిర్మాణాలను అధికారులు ఈ కొత్త విధానం కింద కూల్చివేశారు.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రోనా నేపథ్యంలో బల్దియా ప్రణాళికా విభాగం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం మానేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి జోన్‌లో కొత్త చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఆధ్వరంలో జోన్‌ పరిధిలోని సర్కిల్‌ అధికారులకు కూల్చివేత బాధ్యతలను అప్పగించారు. అయితే స్థానిక సర్కిల్‌ అధికారులపై ఒత్తిడి లేకుండా ఉండటం కోసం అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు పక్కనే ఉన్న మరో సర్కిల్‌ అధికారులను పంపించారు. సదరు అధికారులు అక్కడి ప్రజాప్రతినిధులు, ఇతర నేతలకు తెలియకపోవడంతో ఆటంకాలు లేకుండా కూల్చివేస్తున్నారు. ఉదాహరణకు ఎల్బీనగర్‌ సర్కిల్‌ అధికారులను ఉప్పల్‌కు.. ఉప్పల్‌ సర్కిల్‌ అధికారులను ఎల్‌బీనగర్‌ సర్కిల్‌కు పంపించి కూల్చివేతలు చేయించారు. దీనివల్ల మంచి ఫలితం వచ్చిందని అధికారులు గుర్తించారు. గతంలో ఎల్బీనగర్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు అక్కడి సర్కిల్‌ అధికారులకు బాధ్యతను అప్పగించగా.. కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు వారిపై ఒత్తిడి తేవడం.. కొన్నిచోట్ల బెదిరింపులకు దిగడంతో వెనక్కి తగ్గారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం ఒక సర్కిల్‌లో గుర్తించిన అక్రమ భవనాలను కూల్చివేసేందుకు పక్క సర్కిల్‌ అధికారులను పంపిస్తున్నామని ప్రణాళికా విభాగం అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.

కూల్చివేతల్లో దూకుడు..

ఎల్బీనగర్‌లో జోన్‌ పరిధిలో కొద్దిరోజుల్లోనే పన్నెండు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఉప్పల్‌, కూకట్‌పల్లి తదితర సర్కిళ్లలో కూడా కూల్చివేతలు అధికంగానే ఉన్నాయి. 30 సర్కిళ్లలో దాదాపు 200 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల్లోనే వీటిని కూల్చివేస్తామని చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని