స్నేహగీతం.. విజయసూత్రం
eenadu telugu news
Published : 01/08/2021 06:20 IST

స్నేహగీతం.. విజయసూత్రం

 కష్టాల్లో తోడుగా ముందుకు నడిపిస్తున్న మైత్రి బంధం

నేడు స్నేహితుల దినోత్సవం

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టునీడలో ఒక్కటైన నేస్తాలు. కుల,మతాలకు అతీతంగా దోస్తీకట్టారు. సరదాలు.. షికార్లు... ఆటపాటలను ఆస్వాదించారు. కష్టసుఖాలు.. మంచి చెడులు..పంచుకున్నారు. చదువు పూర్తయ్యాక కొలువులు చేపట్టారు. ఏదోమూలన తమలోని సృజనాత్మకత కేవలం నాలుగు గోడలకే పరిమితం కాకూడదనే ఆశయంతో బయటకు వచ్చారు. ఉద్యోగాలు వదలి.. తమ లక్ష్యాన్ని చేరేందుకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నారు. చేయిచేయి కలిపి.. భాగస్వాములుగా మారారు. ఓటమి ఎదురైనపుడు.. కుంగి పోకుండా.. గెలుపుతో పొంగిపోకుండా అంకుర సంస్థలను ముందుకు నడిపించారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదొడుకులు.. స్పర్థలు అన్నింటినీ అధిగమించి గెలుపు సాధించేందుకు.. బలమైన మిత్రబంధం.. స్నేహమనే నమ్మకమే కారణమంటున్నారు. ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా తమ చెలిమిని ఇలా పంచుకున్నారు.

 - ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


కొలువు వద్దని.. లక్ష్యం చేరాలని

మల్లాది విశ్వనాథ్‌, కొల్లి మాధవ్‌రెడ్డి, సామల సంతోష్‌.. ముగ్గురివీ మూడు ప్రాంతాలు. సూరత్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణం వీరిని స్నేహితులుగా మార్చింది.  కళాశాల ప్రాంగణంలో ఉన్నపుడు సమీపంలోని పల్లెపిల్లలకు ఉచితంగా చదువు చెప్పేందుకు వెళ్లారు. ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త ప్రయోగాలు చేపట్టాలని చర్చించుకునేవారు. చదువులు పూర్తయ్యాక ప్రాంగణ ఎంపికల్లో అవకాశాలు వచ్చినా వద్దనుకున్నారు.  ఆటోమొబైల్‌ రంగంపై అధ్యయనం చేశారు.  భారతీయ రహదారుల పరిస్థితితో వాహనదారులు ఎదుర్కొనే వెన్నునొప్పికి పరిష్కారం చూపాలని భావించారు. ఫెగో ఇన్నోవేషన్స్‌ అంకుర సంస్థను రూపొందించి ప్లోటో ఎయిర్‌ సస్పెన్షన్‌ సీట్లను ఉత్పత్తి చేయటం ప్రారంభించారు.   మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఎదురైన ప్రతికూల ప్రభావంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ప్రయోగాలను ప్రారంభించారు. పాతవస్త్రాలకు కొత్తదనం జోడించి ఫ్యాషన్‌ రంగంలోనూ రాణిస్తున్నారు. స్నేహం అంటేనే నమ్మకం.. అక్కడ కష్టసుఖాలు అన్నీ సమానమే అంటున్నారు విశ్వనాథ్‌.


 గెలుపోటముల్లో అండగా..

దంబాల వీరభద్రరావు, బాలు, ప్రసాద్‌, వర్మ, గుణ, సురేష్‌.. అందరూ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు. అంకుర సంస్థలతో ఎదగాలనే ఆలోచన ఉన్నవాళ్లు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. సొంతంగా బాలానగర్‌లో ‘దక్షా టెక్నాలజీ’ పరిశ్రమను ప్రారంభించిన  వీరభద్రరావుకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.  మిత్రుడిని పారిశ్రామికవేత్తగా మార్చేందుకు తాము కూడా ఉద్యోగ, భాగస్వాములుగా మారారు. థర్డ్‌పార్టీ ద్వారా రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాలు తయారు చేసి అందించారు. కొవిడ్‌తో ఒక్కసారిగా వ్యాపారం తలకిందులయ్యే పరిస్థితికి చేరింది. దీన్ని అధిగమించి వ్యాపారాన్ని కొనసాగించేందుకు మిత్రబృందం పెద్ద సాహసమే చేసింది. అప్పు తీసుకుని కరోనా వ్యాప్తిని నివారించే ఎన్‌95మాస్క్‌లు, శానిటైజర్లు, స్టాండ్స్‌ వంటి వాటిని తయారు చేయటం ప్రారంభించారు. ఎన్ని ఆటంకాలొచ్చినా లాభనష్టాలకు అతీతంగా కలిసే నడుస్తున్నామంటున్నారీ మిత్రులు.


స్నేహం.. సేవా బంధం

ఇద్దరు స్నేహితుల సంకల్పం వందలాది మందికి ఉపాధిమార్గం అయింది. కొవిడ్‌   కల్లోలం నుంచి కొన్ని కుటుంబాలనైనా కాపాడాలన్న వారి ఆలోచన  700 మంది జీవితాల్లో వెలుగు నింపింది. రాము దోసపాటి ఒక సాఫ్ట్‌వేర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌. ప్రతి వారాంతం ఏదోఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటుంటారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి అండగా రైస్‌ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తానూ సమాజానికి ఏదోఒకటి చేయాలన్న ఆలోచన ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యశస్విని జొన్నలగడ్డ..  రైస్‌ ఏటీఎం వద్దకు వచ్చి రాముతో చేతులు కలిపారు. ఆ సంకల్పం స్నేహంగా మారింది. ఇద్దరు కలిసి ఏడాది కాలంలో ఏడు వందల కుటుంబాలకు చేయూత ఇచ్చారు.


సృజన కలిపింది.. ముగ్గురినీ

పల్లవ్‌ బజ్జూరి, శ్రీనివాస్‌ మాధవమ్‌, శ్రీచరణ్‌ లక్కరాజు. నగరానికి చెందిన ముగ్గురు సాంకేతిక ఉన్నత విద్య పూర్తిచేశారు. కొద్దికాలం  ఉద్యోగాలు చేశారు. విద్య, వినోదం, సాంకేతికత వంటి వాటిని డిజిటల్‌ వేదికగా యువతకు చేరువ చేయాలనే సంకల్పంతో.. పల్లవ్‌..కహానియా, శ్రీచరణ్‌.. స్టూమ్యాగ్జ్‌, మాధవమ్‌.. ఎక్స్‌ప్రెస్‌వే వంటి ఆన్‌లైన్‌ సేవలను చేరువ చేసేందుకు అంకుర సంస్థలు ప్రారంభించారు. ‘స్టార్టప్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’లో స్నేహితులుగా మారారు. బేషజాలు లేకుండా కలసిన తమ స్నేహం..యువతకు సాంకేతికతను దగ్గర చేయాలనే ఆలోచనకు బీజం వేసిందంటారు శ్రీచరణ్‌.


ఒంటరైనా.. ఓటమైనా.. వెంటనడిచే తోడై!

30ఏళ్ల క్రితం బళ్లారి గుల్బర్గా యూనివర్సిటీలో ఏపీకి చెందిన 60మంది విద్యార్థులు బీటెక్‌లో చేరి మిత్రులయ్యారు. చదువులయ్యాక ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం నగరానికి చెందిన మిత్రుడు చంద్రారెడ్డి వ్యాపారంలో నష్టం వచ్చి..అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీ మార్చాలని వైద్యులు చెప్పారు. దీంతో మిత్రులంతా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందించి చికిత్స చేయించారు.


వ్యాపారంలో  రాణించేలా వెన్నుతడుతూ..
డాక్టర్‌ లయన్‌ వై.కిరణ్‌, ఎండీ, సుచిరిండియా

మిత్రుడు అశోక్‌తో కిరణ్‌ (కుడివైపు)

వరంగల్‌లో పుట్టి పెరిగిన నేపథ్యం నాది.  అప్పట్లో ఇంట్లో కంటే స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేవారం.  వరంగల్‌లో మిత్రుడు డి.అశోక్‌కు హన్మకొండ చౌరస్తాలో స్వాతి వాచ్‌ కంపెనీ ఉండేది.   డిజిటల్‌ వాచీలు రాకతో విక్రయాలు పడిపోయాయి. దీంతో  కాలానుగుణంగా వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై  సలహాలు, సూచనలు చేయడం, ఆర్థికంగా తోడ్పాటు అందించేవాడిని. ఎలక్ట్రానిక్‌ విక్రయాల వైపు  కంపెనీని మార్పించాను. వస్త్ర దుకాణాలను నిర్వహించే స్నేహితులను ఈ కామర్స్‌ వైపు ప్రోత్సహిస్తున్నాను. నాకున్న సంబంధాలతో వారి వ్యాపారానికి అన్నివిధాలుగా మద్దతిస్తున్నాను.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని