అతిపెద్ద సమస్య మనోరుగ్మతే
eenadu telugu news
Published : 01/08/2021 03:09 IST

అతిపెద్ద సమస్య మనోరుగ్మతే

టీఎస్‌సైకాన్‌-2021’ సదస్సులో తెలంగాణ గవర్నర్‌ డా.తమిళిసై

జ్యోతి వెలిగిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత మానసిక సమస్యలు రెట్టింపయ్యాయని.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఇదేనని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పోస్ట్‌ కొవిడ్‌ కాలంలో పెరిగిన నిరుద్యోగం, ఆసుపత్రుల ఖర్చులు, కుటుంబ ఆర్థిక సమస్యలతో ప్రజలంతా సతమతమవుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌ వేదికగా శనివారం ప్రారంభమైన ‘టీఎస్‌సైకాన్‌-2021’ సదస్సుకు ముఖ్య అతిథిగా గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచే పాల్గొని ప్రసంగించారు. మనోవైద్య నిపుణులంతా కలిసి ఇలాంటి ప్రజోపయోగ సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దేశ ప్రగతిలో పౌరుల శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యమూ కీలక భూమిక పోషిస్తుందన్న గవర్నర్‌.. ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ జి జగన్నాథ్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నసీరాబాదీ, సదస్సు నిర్వహణ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.ప్రసాద్‌రావు, కార్యదర్శి డాక్టర్‌ చైతన్య దీపక్‌, పలువురు  నిపుణులు పాల్గొన్నారు.

మనోవ్యాధి.. మరో ప్రమాదం!

శారీరకంగానే కాదు మానసికంగానూ యావత్‌ దేశాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది కొవిడ్‌ మహమ్మారి. ఉద్యోగాలు కోల్పోయి.. అయినోళ్లను పోగొట్టుకుని.. అప్పులు పెరిగి.. వాటివల్ల తలెత్తుతున్న మానసిక సమస్యలిప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. ఆసుపత్రుల్లో 15 శాతం కేసులు పెరగగా, 0.5 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు పెరిగాయని చెబుతున్నారు. ‘టీఎస్‌సైకాన్‌-2021’ సదస్సులో పలువురు మానసిక నిపుణులు ‘ఈనాడు’తో పలు విషయాల్ని వెల్లడించారు.


రాష్ట్రంలో తీవ్ర మనోవ్యాధితో బాధపడుతున్నవారు 15%
దీని లక్షణాలు: అనవసర కోపం, చిరాకు, తమకు తామే నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, అనుమానాలు, చుట్టూ ఎవరూ లేకున్నా మాటలు వినిపించడం (హెల్యుసినేషన్‌), తప్పుడు విషయాల్ని నమ్మడం (డెల్యుషన్స్‌), వ్యక్తిగత శ్రద్ధ తగ్గడం.
సాధారణ ఆందోళనతో.. 45%
దీని లక్షణాలు: ఒత్తిడి, చిరాకు, కండరాలు పట్టేసిన భావన, ఏకాగ్రత తగ్గడం, నిద్రలో మార్పు, తరచూ చెమట పట్టడం, తలనొప్పి, కడుపులో ఉబ్బరం (ఎపిగ్యాస్టిక్‌ డిస్కంఫర్ట్‌)


* పిల్లల్లోనూ మారిన జీవనశైలితో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పిల్లల్లో వస్తున్న మార్పులు: బరువు తగ్గడం, నిద్రవేళల్లో అసహజ మార్పులు, అసాధారణ చిరాకు, దుఃఖం, నీరసంగా ఉండటం, ఆశ కోల్పోవడం, ఆత్మహత్య ఆలోచనలు పెరగడం.


6 వారాలపైగా ఉంటే సమస్యే
- డాక్టర్‌ ప్రసాద్‌రావు, టీఎస్‌సైకాన్‌ ఛైర్మన్‌

గతంతో పోల్చితే మానసిక సమస్యలు తీవ్రంగా పెరిగాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా 0.5 శాతం పెరిగింది. అంటే చాలా ప్రమాదకరం. లక్షణాలు  6 వారాలు దాటితే సమస్యగా గుర్తించాలి. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. మందులు వాడాలి.


ఎక్కువమంది పిల్లలకు స్కూల్‌ ఫోబియా
- డాక్టర్‌ చైతన్య లక్ష్మీ, మానసిక నిపుణురాలు

కొవిడ్‌ తర్వాత పాఠశాలల్లేవు, బయటికెళ్లే పరిస్థితి లేదు. గతంలో  బడి, ఇల్లు వాతావరణానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడం వారిలో కొత్త సమస్యల్ని సృష్టిస్తోంది.  భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లల్లో స్కూల్‌ ఫోబియా చూడొచ్చు. ఇంటర్నెట్‌కి అతిగా దగ్గరవడమూ వారిని మానసికంగా వింతగా మార్చుతుంది.


 తీవ్ర ప్రమాదం ఇది
- డాక్టర్‌ దీపక్‌, మానసిక నిపుణులు

కొవిడ్‌ తర్వాత వైరస్‌కంటే ఎక్కువ ప్రమాదకరంగా మానసిక జబ్బులు పరిణమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు చెబుతున్నదిదే. చాలామందిలో భవిష్యత్తుపై దిగులు, బయటికెళ్లాలంటే భయం పెరిగింది. దినసరి చర్యల్లో తేడా కనిపిస్తోందంటే సమస్య పెరుగుతోందని అర్థం. గుర్తిస్తే కౌన్సెలింగ్‌ లేదా చికిత్స చేయించుకోవాలి.


15% మందిలో కొత్త సమస్యలు
- డాక్టర్‌ అనీల్‌రెడ్డి, మానసిక నిపుణులు

ఆసుపత్రి ఖర్చులు, ఉద్యోగాలు పోవడం, అప్పులు మెదడుని పూర్తిగా నాశనం చేస్తుండటంతోపాటు కొవిడ్‌ బారిన పడిన వారిలో బ్రెయిన్‌ ఫాగ్‌ సమస్య కనిపిస్తోంది. దీనివల్ల ఆలోచనా శక్తి తగ్గడం, విషయాల్ని మరిచిపోవడం జరుగుతుంది. కొత్తగా 15% మందిలో ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని