గేట్లు తెరిచారు.. చూసొద్దాం రండి..!
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

గేట్లు తెరిచారు.. చూసొద్దాం రండి..!

శ్రీశైలం డ్యామ్‌ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో పర్యాటకం పడకేసింది. ఇప్పుడిప్పుడే క్రమంగా తేరుకుని అడుగులు వేస్తోంది. నగరానికి చేరువగా ఉన్న శ్రీశైలం గేట్లు గురువారం తెరిచారు. నగరం నుంచి భారీ ఎత్తున సొంత వాహనాల్లో వెళ్లి సందర్శించి వస్తున్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌ గేట్లు కూడా తెరిచారు. సోమవారం బోనాల పండగ సెలవు ఉంది. వరుస సెలవులతో నగరవాసి అలా వెళ్లి ఇలా రావాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారిని ఒడిసి పట్టుకోవడంలో తెలంగాణ పర్యాటకం, ఆర్టీసీ వెనుకబడింది.

అవకాశం అందిపుచ్చుకోక..

ఆర్టీసీ దగ్గర మినీ బస్సులున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖతో గానీ.. పర్యాటకాభివృద్ధి సంస్థతో గానీ.. అనుసంధానమై యాత్రలు నిర్వహిస్తే ఉభయకుశలోపరిగా ఉంటుంది. అలాగే నాగార్జునసాగర్‌, శ్రీశైలం పర్యాటక ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లి రావడానికి వీలుంటుంది. కానీ, ఆ దిశగా ఈ రెండు విభాగాలు ఆలోచించడంలేదు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులే కాదు.. నగరానికి చేరువలో చాలా జలపాతాలున్నాయి. బొగత జలపాతం, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కుంటాల, పొచ్చర జలపాతాలను కూడా చూసి వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలి. వర్షాకాలం ఆహ్లాదంగా ఉండే పర్యాటక ప్రాంతాలకు సురక్షితమైన పర్యాటకం ఏర్పాటు చేస్తే.. సందర్శకులు ముందుకు వస్తారు. కానీ, అలాంటి ఆలోచనే చేయడంలేదు. కాలానుగుణంగా పర్యాటక స్వరూపం మార్చుకోకుండా.. ఎప్పుడూ నిర్వహించే యాత్రలతోనే కాలం వెళ్లబుచ్చుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతున్నా.. ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నా.. ఆ భాగ్యాన్ని దర్శించుకునే అవకాశం లేకుండాపోతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని