బత్తాయి ధర ఢమాల్‌!
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

బత్తాయి ధర ఢమాల్‌!

చైతన్యపురి, న్యూస్‌టుడే: బత్తాయి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెల రోజుల క్రితం టన్ను ధర రూ.70 వేల వరకు నడిచింది. ఒక దశలో రికార్డు స్థాయిలో రూ.లక్ష పలికింది. అయితే వర్షాల ప్రభావంతో నేడు టన్ను ధర రూ.18 వేలకు పడిపోయింది. ప్రస్తుతం సీజన్‌ కావడంతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రోజుకు సగటున 390 టన్నుల వరకు సరకును రైతులు తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లాతో పాటు రాయలసీమ నుంచి రైతులు వస్తున్నారు. ఈ సీజన్‌ అక్టోబరు రెండో వారం వరకు కొనసాగుతుంది. ఆగస్టు నుంచి మరింత పుంజుకుంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

25 శాతం మాత్రమే.. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు నిత్యం విక్రయాలకు వచ్చే బత్తాయిలో నగరంతో పాటు పరిసర జిల్లాల్లో 25 శాతం మాత్రమే వినియోగం అవుతున్నట్లు.. మిగిలిన 75 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తామని వ్యాపారులు తెలిపారు. అయితే నగరంలోనూ వినియోగం తగ్గడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాల కారణంగా అనుకున్న స్థాయిలో ఎగుమతులు లేవని చెబుతున్నారు. మహారాష్ట్రకు ఎగుమతి చేసిన బత్తాయి.. కొనుగోలుదారులు లేక కుళ్లిపోతున్నట్లు బత్తాయి వ్యాపారి సయ్యద్‌ అఫ్సర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని