తాండూరు పురపాలక సంఘంలో ఆర్జేడీ విచారణ
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

తాండూరు పురపాలక సంఘంలో ఆర్జేడీ విచారణ


కౌన్సిలర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆర్జేడీ శ్రీనివాస్‌రెడ్డి 

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తాండూరు పురపాలక సంఘంలో ఆ శాఖ ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో రూ.కోట్లల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌, తెజస, సీపీఐ కౌన్సిలర్లు పురపాలక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడరు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, తెజస ఫ్లోర్‌ లీడరు సోమశేఖర్‌ నుంచి ఆర్జేడీ సమాచారాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కౌన్సిలర్లు విలేకరులకు వివరించారు. మున్సిపాలిటీల్లో జరుగుతున్న అక్రమాలపై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా పాలనాధికారిణి పౌసుమి బసుకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని ఫలితం లేకపోవడంతో గత నెలలో లోకాయుక్తను ఆశ్రయించామన్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో విచారించి నివేదిక సమర్పించాలని పురపాలక శాఖకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేయడంతో ఆర్జేడీ ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. పట్టణంలోని చిలుక వాగు పనుల బిల్లులు, బ్లీచింగ్‌ పౌడరు కొనుగోలు, పట్టణ ప్రగతి మొదటి, రెండో దశలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఫిర్యాదుకు సంబందించిన పూర్తి వివరాలను ఆధారాలతో ఆర్జేడీకి అందజేసినట్లు తెలిపారు. ఈ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అనంతరం పురపాలక సంఘం అధ్యక్షురాలు స్వప్నను ఆర్జేడీ విచారించారు. విచారణ నివేదికను పురపాలక శాఖ సీడీఎంఏకు అందజేస్తామని ఆర్జేడీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని