సర్వేతో.. సర్వం నిక్షిప్తం!
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

సర్వేతో.. సర్వం నిక్షిప్తం!

పురపాలికల్లో ఆదాయం పెంపునకు కసరత్తు

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నూతన పన్ను విధానం

ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్‌

న్యూస్‌టుడే,వికారాబాద్‌ మున్సిపాలిటీ


వివరాలు సేకరిస్తున్న పురపాలక సిబ్బంది

పురపాలికల్లో ఆస్తుల రక్షణతో పాటు ఆదాయం దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. పట్టణాల్లో ఉన్న గృహ యజమానుల ఆస్తుల విషయంలో ఎటువంటి తేడాలు లేకుండా పక్కాగా సర్వే చేసి ‘భువన్‌ యాప్‌’లో నమోదు చేయనున్నారు. ఈ విధానంలో వివరాలను తప్పుగా, తక్కువగా చూపడం కుదరదు. ప్రాంతాన్ని బట్టి యాప్‌లో నిక్షిప్తం చేసిన సమాచారం ఆధారంగా పన్ను వసూలు చేస్తారు. కచ్చితమైన లెక్క తేలడంతో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా గతంలో సర్వే నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా మధ్యలో నిలిపివేసి, ప్రస్తుతం మళ్లీ ప్రారంభించనున్నారు.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నాలుగు పురపాలిక సంఘాలున్నాయి. ఆయా పట్టణాల్లో గతంలోనే సర్వే జరిపి భువన్‌ యాప్‌లో నిక్షిప్తం చేశారు. కొవిడ్‌ కారణంగా 16నెలల పాటుగా సర్వే నిలిపివేశారు. తిరిగి వివరాలు సేకరించాలని పురపాలక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు సమాయత్తం మవుతున్నారు. ఈ విధానంలో ఆస్తి పన్నును ఎగ్గొట్టడం, తక్కువ చూపటం ఇక నుంచి కుదరదు. అక్రమాలకు తావులేకుండా పక్కాగా ముదింపు జరగనుంది. సర్వేలో భాగంగా పట్టణాల్లోని భవన నిర్మాణాల సంఖ్యను గుర్తించి, నూతనంగా నిర్మిస్తున్న వాటికి ఇంటి సంఖ్యను కేటాయిస్తారు. అనంతరం నిర్మాణానికి సంబంధించిన చిత్రాన్ని అప్‌లోడ్‌ చేసి పన్ను నిర్ణయిస్తారు. రెండు మూడు అంతస్తులు, వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లోని నిర్మాణాలకు పన్ను తగ్గించి చూపితే తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం ఉండదు.

ఈ నెలాఖరులోగా..: ఇటీవల ఉన్నతాధికారులు పురపాలిక కమిషనర్లతో జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశమై సర్వేను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెలఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. నాలుగు పురపాలికల్లో గృహాలు, దుకాణాలు, దుకాణ సముదాయాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ 13,594, తాండూరు 14 వేలు, కొడంగల్‌ 3,672, పరిగి 4,500.

పెరిగిన నిర్మాణాలు: ఏ పురపాలికలో చూసినా ఇళ్ల నిర్మాణాలు విపరీతంగా పెరగుతున్నాయి. పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తది, రోడ్డు వైపు ఉన్న వాటిలో వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. ఒక అంతస్తు ఉన్న భవనాలను మూడు, నాలుగు అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్తగా నిర్మించిన వాటికి సంబంధించి పూర్తి వివరాలు పురపాలిక కార్యాలయాల్లో లేదు. సర్వేతో పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు.

సిబ్బందే కొలతలు చేపట్టేవారు: పురపాలికల్లో ఆస్తి పన్ను విధించేందుకు గతంలో సిబ్బందే కొలతలను నిర్ణయించే వారు. ఇది పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా జరగకపోవడంతో పెద్ద పట్టణాల్లో అదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ప్రస్తుతం భువన్‌ యాప్‌లో పురపాలికలను నాలుగు నుంచి ఎనిమిది డివిజన్లగా విభజించారు. స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ సూచించిన నిబంధనల ప్రకారం పురపాలికలో ప్రాంతాన్ని బట్టి స్థలాల ధరను పరిగణలోకి తీసుకుని పన్ను నిర్ణయించనున్నారు. సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణం, ఎన్ని అంతస్తులు, సౌకర్యాలు, విస్తీర్ణం, గృహమా, వ్యాపార, వాణిజ్య సముదాయమా అనే వివరాలను నమోదు చేయడంతో పాటు భవనానికి సంబంధించిన చిత్రాన్ని అప్‌లోడ్‌ చేసి జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. సర్వే పూర్తి అయ్యాక వివరాలను ఆన్‌లైన్‌లో పొందపరుస్తారు.


అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి

శివకుమార్‌, రెవెన్యూ అధికారి, పురపాలక సంఘం, వికారాబాద్‌

పురపాలిక పరిధిలో 2019లో సర్వే జరిపాం. అప్పట్లో సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థుల సహకరించారు. కొవిడ్‌ కారణంగా మధ్యలో నిలిపివేశాం. మళ్లి ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని