పరిహారం.. స్వాహాపర్వం!
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

పరిహారం.. స్వాహాపర్వం!

రైతు బీమాలో తవ్వేకొద్ది అక్రమాలు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, కుల్కచర్ల, పెద్దేముల్‌, బంట్వారం

పుట్టాపహాడ్‌లో చంద్రమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న అధికారులు

* పెద్దేముల్‌ మండలానికి ఇందూరు పంచాయతీ పరిధి జైరాంతండాకు చెందిన రైతు అనారోగ్యంతో ఏడాదిన్నర కిందట మృతి చెందారు. రైతు బీమా సొమ్ము కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు చేరాల్సి ఉండగా, స్థానిక వ్యవసాయ శాఖ ఏఈఓ, ఇతరులు కలిసి రూ.5 లక్షలను స్వాహా చేశారు. విషయం వెలుగులోకి వచ్చాక ఏఈఓను సస్పెండ్‌ చేశారు. నగదు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తండ్రి మృతి చెందగా, బీమా డబ్బులను వేరే వ్యక్తుల ఖాతాకు బదిలీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను నిలదీయగా విషయం బయటకు రానీయకుండా డబ్బులు సర్దుబాటు చేశారు.

* బంట్వారం మండలంలోనూ రెండేళ్ల కిందట ఇదే తరహా మోసాన్ని గుర్తించిన అధికారులు గ్రామ రెవెన్యూ అధికారిని సస్పెండ్‌ చేశారు.

* ఇటీవల కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌కు చెందిన చంద్రమ్మకు ఈ ఏడాది రైతు బంధు డబ్బులు రాలేదు. దీంతో ఆమె కుమారుడు అధికారులను సంప్రదించారు. మీ అమ్మ గతేడాదే మృతి చెందిందని, బీమా డబ్బులు రూ.5 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని సమాధానం ఇచ్చారు. అసలు ఏం జరిగిందని వివరాలు సేకరించగా అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బతికుండగానే తన తల్లి చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్ము వాడుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ధ్రువపత్రాలు పరిశీలించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఏఈఓను సస్పెండ్‌ చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

* ఇదే గ్రామానికి చెందిన ఫకీర్‌ హుస్సేన్‌ 2019లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని స్థానికుడైన రాఘవేందర్‌రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో బీమాకు దరఖాస్తు చేశారు. నామినీగా హుస్సేన్‌ సోదరి సైదాబి పేరు ఉండటంతో ఆమె బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షలు జమ అయ్యింది. ధాన్యం డబ్బులు మీ ఖాతాకు వచ్చాయని మమల్ని నమ్మించి రాఘవేందర్‌రెడ్డి డబ్బులు తీసుకున్నాడని హుస్సేన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇలా రైతు బీమాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లోతుగా పరిశీలిస్తే మరిన్ని బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాత మృతి చెందితే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నామినీ బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షలు జమ చేస్తోంది. అయితే గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ, రాజకీయ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించడం, బ్యాంకు ఖాతా సంఖ్య మార్చడం, ఇతర మార్గాల ద్వారా బాధిత కుటుంబానికి అందే సాయాన్ని స్వాహా చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వల్లే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.స్వాధీనం చేసుకోవడంలో జాప్యం

అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేస్తున్నారు. అనంతరం సిబ్బంది తిరిగి విధుల్లో చేరుతున్నారు. అయితే స్వాహా చేసిన రూ.5 లక్షలు మాత్రం తిరిగి రాబట్టడంలో అధికారులు దృష్టిసారించడం లేదు. పెద్దేముల్‌, బంట్వారం, కుల్కచర్ల మండలాల్లో ఐదు సంఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వ సొమ్మును తిరిగి వసూలు చేయలేదు.


పరిశీలించకుండానే

జిల్లాలో 97 క్లస్టర్లకు ఏఈఓలు ఉన్నారు. 18 మండలాలకు మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు. రైతు బీమాకు సంబంధించి అర్జీ వచ్చిన వెంటనే ఏఈఓ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రైతు వివరాలు, కుటుంబ సభ్యులు, నామినీ, బ్యాంకు వివరాలను పరిశీలించాలి. అనంతరం మండల వ్యవసాయ అధికారి సరిచూసుకుని ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగడంలేదు. ఏఈఓలే అన్నీ తామై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బతికుండగానే బీమా సొమ్ము స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల వివరాలను పరిశీలించాలని కలెక్టర్‌ పౌసుమి బసు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,518 మంది బీమాకు దరఖాస్తు చేసుకోగా 14 తిరస్కరించారు. 2,504 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించగా, 2,298 మందికి రూ.5 లక్షలు చొప్పున రూ.114.90 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ అయ్యాయి. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.


చర్యలు తీసుకుంటున్నాం

గోపాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

అక్రమాలకు పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే విధుల నుంచి తొలగించి, కేసులు నమోదు చేస్తున్నాం. పరిహారంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని