ఆమోదం మాది.. నకిలీలకు బాధ్యత మీది!
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

ఆమోదం మాది.. నకిలీలకు బాధ్యత మీది!

అధ్యాపకుల ర్యాటిఫికేషన్‌ ప్రక్రియపై జేఎన్‌టీయూ

కళాశాలల యాజమాన్యాలను బాధ్యులు చేస్తూ ఆదేశాలు

అఫిడవిట్లు ఇవ్వాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌


ఎస్‌సీఎంకు హాజరైన కళాశాలల అధ్యాపకులు

ధ్రువీకరణ పత్రాలు పరిశీలన, నియామకాలకు ఆమోదం చెబుతుంది..! ఎవరైనా అధ్యాపకులు నకిలీ పత్రాలు సమర్పించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగినా తనకు సంబంధం లేదంటూ జేఎన్‌టీయూ చేతులు దులుపుకొంది. కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కళాశాలలు నియమించుకున్న అధ్యాపకులను యూనివర్సిటీ ర్యాటిఫై(ఆమోదం) చేయాల్సి ఉంటుంది. ర్యాటిఫికేషన్‌కు ప్రత్యేకంగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ మినిట్స్‌(ఎస్‌సీఎం) నిర్వహిస్తుంది. ఇందుకు గత నెల 26 నుంచి ఈ నెల 3వరకు ఈ ప్రక్రియ చేపట్టింది. ఇందుకు ఏకంగా 5వేల దరఖాస్తులు వర్సిటీకి అందాయి. నియామక ప్రక్రియ వ్యవహారంలో జేఎన్‌టీయూ మనసు మార్చుకుంది. ఏసీసీటీఈ, పీసీఐ నిబంధనల ప్రకారం అధ్యాపకుల ఎంపిక జరగకపోయినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా భవిష్యత్తులో వెలుగు చూసినా కళాశాల యాజమాన్యానిదే బాధ్యతని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలు తేలితే కళాశాల అఫిలియేషన్‌ రద్దు చేస్తామని తెలిపింది. ఎస్‌సీఎంలో ఎంపికైన అధ్యాపకులు కళాశాల యాజమాన్యాల తరఫున తప్పనిసరిగా అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

మరీ వర్సిటీ ఏం చేస్తున్నట్లు..?

ఇద్దరు సబ్జెక్టు నిపుణులు, ఇద్దరు జేఎన్‌టీయూ ఆచార్యులు, ఒక విభాగాధిపతి, ప్రిన్సిపల్‌, కళాశాల యాజమాన్యం తరఫున ఆచార్యుడు కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి, ధ్రువీకరణ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి నియామకాలకు ఆమోదం తెలపాలి. కొన్నేళ్లుగా ముఖాముఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. కళాశాలల యాజమాన్యాల నుంచి ముడుపులు తీసుకుని అర్హత లేని వారు, నకిలీ ధ్రువీకరణపత్రాలను సమర్పించిన వ్యక్తులను సైతం అధ్యాపకులుగా ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నాలుగేళ్ల కిందట ఏకంగా 300మంది అధ్యాపకులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వ్యవహారం జేఎన్‌టీయూను కుదిపేసింది. అప్పట్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జేఎన్‌టీయూ సరిగా చేపట్టలేదని వర్సిటీపై పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. అందుకే నకిలీ అధ్యాపకులు కొలువులు దక్కించుకున్నారన్న విమర్శలున్నాయి. ఎస్‌సీఎంలు జరిగిన ప్రతిసారీ ఇదే తంతు కొనసాగుతోందన్న ప్రచారమూ ఉంది. ‘‘కేవలం కళాశాలల యాజమాన్యాలదే బాధ్యత అంటూ జేఎన్‌టీయూ చేతులు దులుపుకోవడం సరికాదు. యూనివర్సిటీ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లుగా కనిపిస్తోంది. ఎస్‌సీఎంలలో యూనివర్సిటీ నామినీలను ఎందుకు నియమిస్తున్నట్లు..? ఎస్‌సీఎంల తర్వాత సైతం నకిలీ ధ్రువీకరణ పత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగితే కళాశాల యాజమాన్యాలతోపాటు జేఎన్‌టీయూ కూడా బాధ్యత వహించాలి.’’ అని తెలంగాణ రాష్ట్ర టెక్నికల్‌, ప్రొఫెషనల్‌ కళాశాలల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని