సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

సంక్షిప్త వార్తలు

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నగర పాఠశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నగరం నుంచి రెండు పాఠశాలలు చోటు దక్కించుకున్నాయి. నాచారం, మహేంద్రహిల్స్‌లలోని దిల్లీ పబ్లిక్‌ స్కూళ్లు ఈ ఘనత సాధించాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 7,201 మంది విద్యార్థులు డబ్ల్యూఎన్‌ఎస్‌ కేర్స్‌ ఫౌండేషన్‌ తరఫున సైబర్‌ భద్రతపై శిక్షణ పొందారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే సైబర్‌ భద్రతపై ప్రత్యేక మాడ్యుల్స్‌ సాయంతో శిక్షణ తీసుకుని ధ్రువీకరణ పొందారు. మాడ్యుల్‌ చివరిలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే క్విజ్‌లోనూ విజయం సాధించి, ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. విద్యార్థుల ప్రతిభను దిల్లీ పబ్లిక్‌స్కూల్స్‌ ఛైర్మన్‌ కొమరయ్య, డైరెక్టర్‌ ఎం.పల్లవి, ప్రిన్సిపల్‌ సునీత.ఎస్‌.రావు, డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్రూపు సీఈవో కేశవ్‌ తదితరులు అభినందించారు.


నేడు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి తాగునీటిని అందించే కృష్ణా ఫేజ్‌-3లో యాచారం వద్ద ప్రధాన పైపులైన్‌కు ఏర్పడిన లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతులు చేస్తున్న దృష్ట్యా బుధవారం ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌ చేస్తున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. బీఎన్‌రెడ్డి నగర్‌, ఆటోనగర్‌, వనస్థలిపురం, సరూర్‌నగర్‌, అల్కాపురి, దిల్‌సుఖ్‌నగర్‌, రాజీవ్‌ గృహకల్ప, బండ్లగూడ, ఉప్పల్‌, బీరప్పగూడ, స్నేహపురి, కైలాసగిరి, బోడుప్పల్‌, మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్‌, హైదర్‌గూడ, రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, సులేమన్‌నగర్‌, ఎంఎం పహాడి, అత్తాపూర్‌, చింతల్‌మెట్‌, గోల్డెన్‌హైట్స్‌, ప్రశాషన్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, తట్టిఖాన, మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌస్‌, కాకతీయనగర్‌, హుమాయూన్‌నగర్‌, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్‌, ఎఈఎస్‌, షేక్‌పేట, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌నగర్‌కాలనీ, జియాగూడ, అల్లబండ, శాస్త్రిపురం, మాదాపూర్‌, బోడుప్పల్‌, చెంగిచెర్ల, మల్లికార్జుననగర్‌, చాణిక్యపురి, లాలాపేట, మౌలాలి, మణికొండ, గంధంగూడ, నార్సింగి, సైనిక్‌పురి, అల్వాల్‌ ప్రాంతాల్లో సరఫరా బంద్‌ చేస్తున్నట్లు పేర్కొంది.


మాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరిట మోసం

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు మాట్రిమోనీ ద్వారా పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.10 లక్షలు కాజేసిన నైజీరియన్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి 2021 ఫిబ్రవరిలో తెలుగు మాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేశారు. రెండు రోజులకు మెహోల్‌ కుమార్‌ మునగాల అనే వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను యూఎస్‌లో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నానని, భారత్‌కు చెందిన వాడినే అయినా యూఎస్‌ పౌరసత్వం పొందానని చెప్పాడు. ఇదివరకే పెళ్లై.. పిల్లలుండగా, భార్య చనిపోయిందని చెప్పాడు. మీరు సరేనంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. దానికి బాధితురాలు సరే అన్నారు. పెళ్లి తర్వాత అమెరికాకు తీసుకెళ్తానని, వీసా ప్రాసెసింగ్‌ కోసం రూ.50 వేలు పంపించమన్నాడు. బాధిత యువతి ఆ మొత్తాన్ని పంపించేశారు. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్య బాగా లేదని, ఆసుపత్రి అవసరాలకు అంటూ విడతల వారీగా రూ.10 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కొద్ది రోజులకు గుజరాత్‌లో ఇల్లు కొన్నా.. రిజిస్ట్రేషన్‌కు డబ్బులు అవసరమని చెప్పడంతో యువతి అప్రమత్తమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. యువతి నుంచి డబ్బులు కాజేసిన నెజీరియన్‌ దిల్లీలో ఉన్నట్లు తెలిసి పోలీసు బృందం అక్కడికి వెళ్లింది. మోహన్‌ గార్డెన్‌ ప్రాంతంలో విక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను వృత్తిరీత్యా బార్బర్‌. ఏడాది గడువున్న వీసాతో 2019 అక్టోబరులో భారత్‌కు వచ్చాడు. మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించే ముందు కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌ వచ్చిందని, గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం.


మొదటి భార్యను మరిచిపోలేక ఆత్మహత్య

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మొదటి భార్య జ్ఞాపకాలను మరిచిపోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. నారాయణపేట జిల్లా నర్వ మండలం బక్కెరపల్లె గ్రామానికి చెందిన మల్లేష్‌(35) ఫిలింనగర్‌లోని జ్ఞాని జైల్‌సింగ్‌నగర్‌లో తమ కుటుంబాలతో కలిసి వేర్వేరుగా నివసిస్తున్నారు. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్న మల్లేష్‌ 2011లో శివాని అనే మహిళను వివాహం చేసుకోగా వారికి పిల్లలు నవదీప్‌(9), జీవన్‌(7) ఉన్నారు. ఆమె గతేడాది సెప్టెంబరులో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మల్లేష్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మూడు నెలల అనంతరం రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య జ్ఞాపకాలను మరిచిపోలేని మల్లేష్‌ సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. కుమారుడు చూసి రెండో అంతస్తులో నివసించే బంధువు శివకు తెలిపాడు. వారు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మల్లేష్‌ మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని