భూములకు మినహాయింపుపై మీ వైఖరేమిటి?
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

భూములకు మినహాయింపుపై మీ వైఖరేమిటి?

జీవో 111పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నదీ పరీవాహక పరిరక్షణ నిమిత్తం జీవో 111 పరిధిలో లేని భూములకు మినహాయింపు ఇవ్వడంపై వైఖరి ఏమిటో చెప్పాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి కమిటీ సిఫారసులు చేసినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది. వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లలోని ప్రైవేటు భూములను జీవో 111 పరిధి నుంచి తొలగించడంపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. జీవో 111కు సంబంధించిన జీవో పరిధిలోకి తమ భూమిని చేర్చారని, దీన్ని తొలగించాలని కోరుతూ 2017లో అగ్ని ఆగ్రోటెక్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీవాహక ప్రాంతంలో లేని కొన్ని సర్వే నంబర్లను ఇందులో చేర్చడంపై తమ అభ్యంతరమన్నారు. వాటిలోని తమ భూమిని జీవో పరిధి నుంచి తొలగించాలని కోరుతున్నామన్నారు. ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) 2006లో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ సర్వే నంబర్లు జీవో 111 పరిధిలోకి రావని పేర్కొందన్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అయితే జీవో పరిధి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదని విన్నవించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.ఎస్‌.మూర్తి వాదనలు వినిపిస్తూ జీవో 111 పరిధి విస్తృతమైనదని, నగరానికి నీటిని అందించే జలాశయాల పరీవాహక పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇందులో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు వెలిశాయని, పలువురు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు జీవోను సవాలు చేస్తూ పిటిషన్‌లు దాఖలు చేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ జీవో 111కు సంబంధించిన అంశం మంత్రిమండలి పరిశీలనలో ఉందని, దీనిపై కమిటీలు ఏర్పాటయ్యాయని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని