నలుచెరగులా.. నవ్యాసుపత్రులు
eenadu telugu news
Updated : 04/08/2021 11:18 IST

నలుచెరగులా.. నవ్యాసుపత్రులు

రాజధానిలో నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశం

ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హానగరంలో నాలుగు వైపులా నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు రాబోతున్నాయి. ఇందులో మూడువేల పడకలతో మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, వాతావారణ కాలుష్యం వల్ల ఎదురవుతున్న రోగాలను నయం చేసే మరో ఆస్పత్రిని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. వీటికి స్థలాలను కూడా దాదాపు ఖరారు చేశారు. రోడ్లు-భవనాల శాఖకు ఆస్పత్రి భవనాలను నిర్మించే బాధ్యతను అప్పగించారు. భవనాల నిర్మాణంపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్నీ కుదిరితే నెల రోజుల వ్యవధిలో టెండర్లు కూడా పిలవాలని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో ఉండటంతో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి ఆస్పత్రులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

టిమ్స్‌కు అనుబంధంగా..

రాజధాని నగరంలో జనాభా 20 లక్షల ఉన్న సమయంలో గాంధీ, ఉస్మానియాతోపాటు మరికొన్ని ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జనాభా కోటి దాటింది. ఈ లెక్కన ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య మరిన్ని భారీగా పెరగాల్సి ఉంది. మొదటి దశలో కరోనా విజృంభించిన వేళ ఏడాదిన్నర కిందట రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడ వెయ్యిపడకలతో సూపర్‌స్పెషాల్టీ వైద్యం అందించాలని సర్కార్‌ భావించింది. కానీ ఇంకా అక్కడ పూర్తి ఏర్పాట్లు కాలేదు. మొదటి, రెండో దశ కరోనా సమయాల్లో కూడా ఇక్కడ వేలాదిమంది కరోనా రోగులకు చికిత్స అందించారు. టిమ్స్‌కు అనుబంధంగా మరో మూడు దవాఖానాలు మూడు దిక్కులా ఒక్కో దాంట్లో వెయ్యి పడకలు ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్ది రోజుల కిందట అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.

ఇలా పిలుస్తారు..

కొత్తగా నిర్మించనున్న దవాఖానాలన్నింటినీ టిమ్స్‌ పరిధిలోకి తెచ్చారు. చెస్టు ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే దవాఖానాను సనత్‌నగర్‌ టిమ్స్‌గా పిలుస్తారు. అలాగే ఎల్బీనగర్‌ టిమ్స్‌, అల్వాల్‌ టిమ్స్‌ అని పిలవాలని నిర్ణయించారు. ప్రతి ఆసుపత్రిని ఓ సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఉదాహరణకు సనత్‌నగర్‌ టిమ్స్‌ను గుండెలు, అల్వాల్‌ టిమ్స్‌ను నరాల స్పెషాల్టీగా తీర్చిదిద్దాలని అనుకున్నా కూడా అక్కడ ఇతర రోగాలకు సంబంధించి విభాగాలను ఏర్పాటు చేస్తారు.


పఠాన్‌చెరులో 250 పడకలతో..

ఠాన్‌చెరు ప్రాంతంలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల అనేకమంది వివిధ రకాల వ్యాధుల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కాలుష్యం వల్ల ఉత్పన్నమవుతున్న రోగాలకు చికిత్స అందించే వీలుగా 250 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి కేంద్ర కార్మిక సంక్షేమ నిధి నుంచి కొంత నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఒక్కో ఆసుపత్రి నిర్మాణానికి చేయనున్న వ్యయం  రూ.వెయ్యి కోట్లు

ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న పడకలు సుమారు 7500

కొత్తగా అందుబాటులోకి వచ్చేవి 3250


త్వరితగతిన నిర్మాణం

పేదల కోసం మహానగరంలో మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే స్థలాలను కూడా పరిశీలించాం. ఒక్కో ఆస్పత్రికి ఎన్ని భవనాలు అవసరం అవుతాయన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి నిర్మాణ ప్రణాళికను రూపొందిస్తున్నాం. దీన్ని త్వరలో పూర్తి చేసి టెండర్లను పిలవడానికి ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

- గణపతి రెడ్డి, రోడ్డు భవనాల శాఖ ముఖ్య ఇంజినీర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని