గొంతు కోసి.. యువకుడి హత్య
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

గొంతు కోసి.. యువకుడి హత్య

బషీరాబాద్‌లో కలకలం రేపిన ఘటన

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ జలందర్‌రెడ్డి

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున బషీరాబాద్‌లో కలకలం రేపింది. తాండూరు రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి, ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బషీరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సయ్యద్‌, రషీదాబేగం మొదటి కుమారుడు జుబేర్‌ (25) దర్జీ (టైలరింగ్‌) పని తోపాటు టెంట్‌హౌజ్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అందరితో కలిసి మెలిసి ఉండే అతడు దారుణ హత్యకు గురి కావడంతో కాలనీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. బుధవారం రాత్రి పది గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారేసరికి హత్యకు గురి కావడంపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు బోరున విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తూ విచారణ ముమ్మరం చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు.

ప్రేమ వ్యవహారమే కారణమా?

బషీరాబాద్‌ శ్మశానవాటిక, పోచమ్మ ఆలయ దారిలో జుబేర్‌ రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్న విషయాన్ని గురువారం తెల్లవారుజామున కొందరు అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కత్తితో కిరాతకంగా గొంతు కోసి హత్య చేసినట్లు అనవాళ్లు ఉన్నాయి. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసి ఉండవచ్చని మృతుడి సన్నిహితులు, గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనం నుంచి కొద్ది దూరం వరకు దారిపై రక్తపు మరకలున్నాయి. కత్తితో దాడి చేసిన తరువాత పారిపోదామని వెళుతూ.. కొద్దిదూరం వెళ్లాక కుప్పకూలి పడిపోయినట్లు దారి వెంబడి తీవ్ర రక్తపు మరకలున్నాయి. దుండగులు వెంబడించి చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

డాగ్‌ స్వ్కాడ్‌, క్లూస్‌టీం పరిశీలన..

హత్య జరిగిన ప్రదేశం వద్ద డాగ్‌ స్వ్కాడ్‌, క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. ఘటన ప్రదేశం నుంచి కుక్క వాసన పసిగడుతూ శ్మశానవాటికి దారి నుంచి మృతుడి కుటుంబం, సమీప ఇళ్ల వద్దకు వెళ్లి తిరగి హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుంది. వికారాబాద్‌ నుంచి వచ్చిన క్లూస్‌టీం గమనించింది. జుబేర్‌ ఉపయోగించిన వాహనం, ఇతన ఆధారాలను పోలీసులు సేకరించారు.

పోలీసుల అదుపులో అనుమానితులు..

హత్యకు సంబంధించి కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా జుబేర్‌ ఇంటి వద్ద, అనుమానితుల ఇళ్ల వద్ద, కాలనీలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని