పడతి.. ప్రగతికి తరుణం
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

పడతి.. ప్రగతికి తరుణం

 కొత్త సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం

నెలాఖరు నుంచి పంపిణీకి సన్నాహాలు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

కరణ్‌కోటలో మహిళలు

మహిళాభ్యున్నతికి స్వయం సహాయక సంఘాలను కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అతివలను చేర్పించి మరిన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో నమోదైన సభ్యులకు తొలిసారిగా రుణాల పంపిణీకి అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రక్రియ పూర్తైతే పెట్టుబడి లభించి ఆసక్తి ఉన్న వ్యాపారాలతో స్థిరపడేందుకు బాటలు వేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గ్రామీణులు సంఘాల్లో చేరి తమను తాము తీర్చిదిద్దుకుంటూ, కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వారికి కిరాణం, అంతర్జాలం, హోటల్‌, బ్యూటీపార్లర్‌లు, అలంకరణ వస్తువులు, వస్త్ర విక్రయాలు వంటి వ్యాపారాలు, దుస్తుల తయారీతో దర్జీ వృతి, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు నెలకొల్పాలన్న ఆసక్తి ఉంటోంది. ఆయా ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి సొమ్ములేక ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో అవకాశాలు, అర్హతలు, ఉత్సాహం ఉన్నప్పటికీ ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి వారంతా స్వయం సహాయక సంఘాల్లో చేర్పించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అధికారులు వారి ఉపాధి ఆశలను నెరవేర్చేదిశగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వివాహం జరిగిన వేలాది మంది మహిళలను గుర్తించారు. వారందరితో కొత్తగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. ఆయా సంఘాల్లో మార్చి నుంచి జులై వరకు వివాహితలను దశలవారీగా చేర్పించారు. వారితో నెలనెలా రూ.30 నుంచి రూ.100 వరకు పొదుపు చేయిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు చేపట్టిన వారితో పొదుపు అలవాటు చేసి ఆర్థిక క్రమశిక్షణను అలవరిచారు.

రూ.లక్ష నుంచి రూ.10లక్షలు: కొత్తగా చేరిన వారికి ఆరునెలల అనంతరం రుణాలు అందించాల్సి ఉంది. ఈక్రమంలో జిల్లాలోని పద్దెనిమిది మండలాల పరిధిలో కొత్త సంఘాల మహిళలకు నెలాఖరు నుంచి రుణాలు అందించనున్నారు. సెప్టెంబరులో రుణాల పంపిణీ వేగవంతం చేయనున్నారు. రూ.10కోట్లకు పైగా అందించే అవకాశముంది. ఒక్కో సంఘానికి ఇప్పటివరకు రూ.50వేలు ఇస్తుండగా దాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రెట్టింపు చేశారు. దీంతో ఒక్కో సంఘానికి తొలిసారిగా రూ.లక్ష రుణం దక్కనుంది. రెండోసారి రూ.2 లక్షలు, మూడోసారి రూ.5 లక్షలు, నాలుగోసారి రూ.7.50లక్షలు, ఐదోసారి రూ.10 లక్షల పొందే వీలుంటుంది. ఆయా రుణాలను 30 నుంచి 60 నెలల సులభ వాయిదాల్లో తీర్చే వెసులుబాటు కల్పించారు. సకాలంలో వాయిదాలు కట్టిన సంఘాల్లోని మహిళలకు వడ్డీ మాఫీ పథకాన్ని వర్తింపజేయనున్నారు. దీంతో ఆయా సంఘాల మహిళలు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లించనున్నారు. తద్వారా ఆర్థిక ఉపశమనం లభించనుంది. రుణాలతో మహిళలు తమకు ఆసక్తిఉన్న యూనిట్లను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందడంతోపాటు కుటుంబపోషణలో భాగస్వాములు కానున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రగతిబాటలో పయనించనున్నారు.
కిరాణా దుకాణం ఏర్పాటు
అనిత, బెల్కటూరు

డ్వాక్రా సంఘంలో చేరి ఆరు నెలలు అవుతోంది. పూచీకత్తు లేకుండా సంఘం ద్వారా రుణం అందించడం సంతోషకరం. ఇంటి వద్ద కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలనుకుంటున్నా.
దర్జీ వృత్తి కొనసాగిస్తా
జగ్గమ్మ, చిట్టిగణాపూర్‌

పొదుపు సంఘంలో చేరడంతో వచ్చే రుణంతో కుట్టు మిషన్‌ కొనుగోలు చేస్తా. ఇంటి వద్ద దుస్తులు కుట్టడం ద్వారా స్వయం ఉపాధి పొందుతా. వచ్చిన ఆదాయంలో వాయిదాల సొమ్ము పోనూ మిగతాది కుటుంబ అవసరాలకు వినియోగిస్తా.
తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం
నర్సింహులు, అదనపు డీఆర్‌డీఓ

మార్చి నుంచి కొత్తగా సంఘాలను ఏర్పాటు చేశాం. ఆరునెలలు గడిచిన వాటికి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేస్తాం. రుణ పరిమితిని ఈసారి రెండింతలు చేశా. వ్యాపార, కుటీర పరిశ్రమ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా తోడ్పాటు అందిస్తాం. ఆయా రంగాల్లో రాణించేలా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తాం.

స్వయం సహాయక సంఘాలు: 14,228
సభ్యులు: 1,44,885
రుణాల లక్ష్యం:
రూ.360.44 కోట్లు
కొత్తగా ఏర్పాటైన సంఘాలు: 1,795
చేరిన మహిళలు: 17,950


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని