అయిదేళ్లు.. అదే తీరు
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

అయిదేళ్లు.. అదే తీరు

 నెమ్మదిగా సాగుతున్న పనులు

నాణ్యతను విస్మరిస్తున్న గుత్తేదారులు

కొలిక్కిరాని రెండు పడకల గదుల ఇళ్లు

అధికారులు దృష్టి సారిస్తేనే ప్రయోజనం

కొడంగల్‌లో కుంటను తలపిస్తున్న పునాదులు

*  పరిగి నియోజకవర్గంలో 501 రెండు పడకల గదుల నిర్మాణాలు చేపట్టాలన్నది లక్ష్యం. పట్టణాల్లో 36, పల్లెల్లో 30 నివాసాల పనులు ప్రారంభించారు. కుల్కచర్లలో 30 పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. మిగతా వాటిల్లో పురోగతి శూన్యం.
* తాండూరు నియోజకవర్గంలో 1,761 ఇళ్లు నిర్మించాలి. పట్టణ ప్రాంతంలో 1,001 పనులు చివరి దశలో ఉన్నాయి. కొన్నింటికి రంగులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి సంబందించి 760 ఇప్పటి వరకు ప్రారంభించలేదు.
* వికారాబాద్‌ పట్టణంలో 401 ఇళ్లకు 156 పనులు ప్రారంభించారు. కొన్ని పిల్లర్లు వేస్తుండగా, మరికొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో నిర్మించాల్సిన 600కు 240 పనులు ప్రారంభించారు. మిగతావాటిని పట్టించుకోవడం లేదు.
* కొడంగల్‌ పట్టణ శివారులో 300 నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు కొన్ని పునాది స్థాయిలో ఉన్నాయి.  మరికొన్ని గుంతలు తీసి వదిలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల్సిన 73 ఇళ్లను విస్మరించారు. 

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే పరిగి, కుల్కచర్ల, కొడంగల్‌, తాండూరు

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా 2017లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.16.22 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. అయిదేళ్లవుతున్నా లబ్ధిదారుల కల నెరవేరడంలేదు. వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఇంకా పునాది, పిల్లర్ల స్థాయిలోనే ఉండటం శోచనీయం. అధికారులు, గుత్తేదారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప పనుల్లో పురోగతి కనిపించడంలేదు. ఇక చేపట్టిన నిర్మాణాల్లో రాతి పొడి వాడుతున్నారని, నాణ్యతను విస్మరిస్తున్నారన్న ఆందోళన నెలకొంది.

పరిగి మండలంలో ఇలా..

నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. అయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో  టెండరు ప్రక్రియే ప్రారంభించలేదు. తొలినాళ్లలో స్థలం కేటాయింపుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయినా రెవెన్యూ అధికారులు కల్పించుకుని వాటిని సరిదిద్దారు. ఇలా ఏడాదంతా వృథా అయినా, మూడున్నరేళ్లుగా నిర్మాణాలు చేపట్టడంలో గుత్తేదారులు ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఇసుక, సిమెంటు కేటాయింపులు సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. నిర్మాణ పనులను ఒక శాఖకు అప్పగించకుండా పంచాయతీరాజ్‌కు కొన్ని, రహదారులు భవనాల శాఖకు మరికొన్ని, పురపాలక శాఖ, ఇతర విభాగాలకు కేటాయించారు. దీంతో ఆయా శాఖల్లో పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

కంకర పొడితో నిర్మాణాలు
ఇళ్ల నిర్మాణంలో ఇసుక వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి శివసాగర్‌, బొంరాస్‌పేట, ఇతర ప్రాంతాల్లో రిచ్‌లను కేటాయించారు. అయినా వాటిని పక్కదారి పట్టించారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామంతో ఇసుక లేదు. దొడ్డుఇసుక వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కంకర పొడితో పనులు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసినట్లవుతోంది. భవనం జీవిత కాలం సగానికి సగం తగ్గుతుందని ఇంజినీరింగ్‌ సిబ్బంది పేర్కొంటున్నారు. అధికారికంగా రోబో శాండ్‌, సాధారణ ఇసుక చెరి సగం కలిపి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో అనుమతిస్తోంది. దీంతో మన జిల్లాలో మాత్రం చౌకగా లభించే తెల్లని బుగ్గిని వినియోగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే విషయమై నిర్మాణ సంస్థను సంప్రదించగా ఇసుక కొరత ఉన్నందున సుమారుగా 10 శాతం నుంచి 15 శాతం వరకు డస్ట్‌ వినియోగిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి సుమారుగా 50 నుంచి 70 శాతం రాతి పొడి, 20 శాతం నుంచి 30 శాతం వరకు ఇసుక వినియోగిస్తున్నారని సమాచారం. ఫలితంగా పేదలకు ఇచ్చే ఇళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారే ప్రమాదం పొంచి ఉంది. పదేళ్లు గడిచాక ఈ నిర్మాణాలు ప్రమాదాలకు నిలయాలుగా మారవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం
మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించాం. ఒత్తిడి చేస్తున్నాం. నేరుగా కలెక్టర్‌ పర్యటించి పనుల ప్రగతిని తెలుసుకుంటున్నారు. పనుల్లో వేగం పెరిగింది. రాతి పొడి వినియోగంపై ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి, నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని