సాంకేతిక కళాశాలలకు ‘గుర్తింపు’
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

సాంకేతిక కళాశాలలకు ‘గుర్తింపు’

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి సాంకేతిక కళాశాలలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రార్‌ డా.మంజూర్‌ హుస్సేన్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అపరాధ రుసుముతో 23వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రత్యేక బృందాలు.. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు అక్టోబరు 25 నుంచి ప్రారంభించాలని ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక విశ్వవిద్యాలయాలకు సూచించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. అప్పటికి కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలి. ఈ నెల 25 తర్వాత ప్రత్యేక బృందాలతో కళాశాలల తనిఖీ ప్రారంభించి సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేయాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. గతేడాది కరోనా తీవ్రత కారణంగా తనిఖీలు లేకుండానే జేఎన్‌టీయూ అధికారులు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి సైతం అదే పంథా కొనసాగించేందుకు కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి తప్పనిసరిగా తనిఖీలు చేస్తామని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని