దోచుకొనుడే తప్ప రక్షణ ఏది?
eenadu telugu news
Updated : 06/08/2021 11:41 IST

దోచుకొనుడే తప్ప రక్షణ ఏది?

బండి పెడితే బాదుడు ఒకెత్తయితే.. వాటికి జూబ్లీ బస్సు స్టేషన్లో రక్షణ కరవైంది. వేలాదిమంది సొంత వాహనాలను జేబీఎస్‌ పార్కింగ్‌లో పెట్టేసి.. జిల్లాలకు వెళ్లి తిరిగి వస్తుంటారు. రోజుకు 60 వేల మంది జేబీఎస్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కనీసం 30 వేల మంది ఇక్కడ వాహనాలను పార్కు చేసి వెళ్లి వస్తుంటారు. వాళ్లు వెళ్లి వచ్చే లోపు వాహనాల రూపురేఖలు మారిపోయి మట్టి కొట్టుకుపోతున్నాయి.

నిమిషం అటుఇటు అయినా.. ద్విచక్ర వాహనాలకు 3 గంటలకు రూ.10 పార్కింగ్‌ ఫీజు తీసుకుంటారు. 15 గంటలైతే రూ.30. రోజంతా రూ.50. కారు పార్కింగ్‌కు మొదటి మూడు గంటలకు రూ.20, 15 గంటలకు 50, రోజంతా పార్కు చేస్తే రూ.75 తీసుకుంటారు. ఈ సమయాల్లో ఒక్క నిమిషం ఎక్కువైనా.. తర్వాత ఉన్న ధర ముక్కుపిండి వసూలు చేస్తారు. హెల్మెట్‌కు రూ.10 తీసుకుంటారు. ఇంత కచ్చితంగా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసే నిర్వాహకులు.. వాహనాలకు రక్షణ మాత్రం కల్పించరు. షెడ్డులుండవు.. పార్కింగ్‌ స్థలం తక్కువ. వాహనాలకు గీతలు పడుతున్నాయి. వాహనాలు దుమ్ము కొట్టుకుపోతుంటాయి. ఎండకు ఎండి.. వర్షానికి తడిచి పాడవుతుంటాయి. బహుళ అంతస్తుల పార్కింగ్‌ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

మూడు దశాబ్దాలుగా ఇదే నరకం.. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ బస్సు స్టేషన్‌ను 1986లో 16.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రతి రోజు 1,215 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రోజూ దాదాపు 50 నుంచి 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ వాహనదారుల కష్టాలు తీరట్లేదు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని