ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌

రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రసంగిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌,
ఐఐసీటీ ఆడిటోరియం నుంచి మాట్లాడుతున్న డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణను భారత దేశ ఫార్మాహబ్‌గా మార్చడంలో ఐఐసీటీ శాస్త్రవేత్తల పాత్ర ఎంతో ఉందని.. భవిష్యత్తులో హైదరాబాద్‌ అంతర్జాతీయ ఫార్మా రాజధానిగా అవతరిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) గురువారం నిర్వహించిన 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా గవర్నర్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు నడిపించడంలో శాస్త్ర, సాంకేతికత పురోగతి చాలా కీలకమన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా తయారీకి ఆత్మనిర్భర్‌ చేపట్టారని దాని ఫలితమే దేశీయంగా టీకా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక్కడ తయారైన కొవాగ్జిన్‌ ఉత్పత్తిలో భాగస్వాములైన ఐఐసీటీని, శాస్త్రవేత్తల బృందాన్ని ఆమె అభినందించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ సి మండే మాట్లాడుతూ.. దేశంలో జనరిక్‌ ఫార్మాతో చౌక ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవడంతో ఐఐసీటీ కృషిని అభినందించారు. ఈ సంస్థ ఏడున్నర దశాబ్దాలుగా ఫార్మా రంగంలో విశ్వసనీయమైనదిగా గుర్తింపు పొందిందని ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ అన్నారు. కార్యక్రమంలో సిప్లా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ రుమానా హమీద్‌ తదితరులు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని