కస్టమ్స్‌ అధికారుల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరి అరెస్టు
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

కస్టమ్స్‌ అధికారుల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

సుధాకర్‌, బి నాగార్జున్‌రెడ్డి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: అనారోగ్యం కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ యువకుడు మోసాల బాట పట్టాడు. మరో వ్యక్తితో కలిసి కస్టమ్స్‌ అధికారుల అవతారం ఎత్తారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరినీ ఆర్జీఐఏ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. నిందితుల వద్ద నుంచి రూ.25.20 లక్షల నగదు, 4 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌, కడపకు చెందిన అవ్వారు సుధాకర్‌(33) పదవ తరగతి చదివి చేనేత వృత్తిలో ఉన్నాడు. నాలుగున్నరేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా చేనేత పనులు వదిలేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం శంషాబాద్‌ విమానాశ్రయంలోని కస్టమ్‌ బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తా అంటూ అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యంను నమ్మించి రూ.6లక్షలు మోసం చేశాడు. ఐదు నెలల క్రితం విజయవాడకు చెందిన ఎన్‌.రాంప్రసాద్‌తో పరిచయం చేసుకున్నాడు. విమానాశ్రయంలో పట్టుబడిన బంగారాన్ని కిలో రూ.32 లక్షలకే ఇస్తామంటూ నమ్మించాడు. గత నెల 19న నగదు తీసుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి రాంప్రసాద్‌ చేరుకున్నాడు. కడపకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ నాగార్జున్‌రెడ్డిని కస్టమ్స్‌ మేనేజర్‌ అంటూ రాంప్రసాద్‌కు పరిచయం చేశాడు. రూ.32 లక్షల నగదును తీసుకుని బంగారం తీసుకొస్తామంటూ సుధాకర్‌, నాగార్జున్‌రెడ్డి విమానాశ్రయం లోపలికి వెళుతున్నట్లు నటించి క్యాబ్‌లో స్వస్థలానికి వెళ్లిపోయారు. ఇద్దరి చరవాణులు మూగబోవడంతో అనుమానం వచ్చిన రాంప్రసాద్‌ ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. కస్టమ్స్‌ మేనేజర్‌గా నటించిన నాగార్జున్‌రెడ్డికి రూ.లక్ష ఇచ్చాడు. భార్యకు రూ.2 లక్షలతో బంగారు ఆభరణాలు చేయించాడు. రూ.30లక్షల కంటే ఎక్కువ వచ్చిన మొత్తం నగదును వారణాసి ఆలయంలోని హుండీలో వేస్తానని ముందే మొక్కుకున్నాడు. ఆమేరకు రూ.2 లక్షల నగదును హుండీలో వేసి తిరిగి స్వస్థలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, సిబ్బందిని డీసీపీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని