‘టీసీ’.. ప్రవేశానికి పేచీ!
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

‘టీసీ’.. ప్రవేశానికి పేచీ!

కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక.. సర్కారీ బడులను ఆశ్రయిస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ) లేకపోవడంతో ఛైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థి వివరాలు నమోదు కావడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. దీనివల్ల టీసీలు తెచ్చుకునేందుకు విద్యార్థులు నానాతంటాలు పడాల్సి వస్తోంది. 8వ తరగతి వరకు ఎలాంటి టీసీలు అవసరం లేకుండా ప్రవేశాలు కల్పించాలని జాతీయ విద్యా విధానం సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల నుంచి టీసీలు అడగకుండా నేరుగా చేర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్కారీ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ నెల ఒకటో తేదీ నుంచి టీవీ, టీశాట్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. 3 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఫీజులు చెల్లించలేక తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. వారికి టీసీలు లేకపోతే చేర్చుకోవడం కష్టంగా మారుతోంది.

కాలమ్‌ తొలగిస్తేనే.. పాఠశాలలో చేరిన విద్యార్థి వివరాలను తప్పనిసరిగా ఛైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేయాలి. అప్పుడే ఆ విద్యార్థి సదరు పాఠశాలలో చదువుతున్నట్లు అధికారికంగా ఉంటుంది. ఛైల్డ్‌ ఇన్‌ఫోలో టీసీ కాలమ్‌ను ఖాళీగా ఉంచాల్సి రావడంతో వెబ్‌సైట్‌లో నమోదు కావడం లేదు. దీనివల్ల విద్యార్థి వివరాలు పాఠశాల తరఫున నమోదు కావడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఆ కాలమ్‌ను తొలగించడం లేదా బ్లాక్‌ చేయడం చేయాలని సూచిస్తున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని