సబర్బన్‌ బస్సులకు మంగళం!
eenadu telugu news
Updated : 06/08/2021 06:31 IST

సబర్బన్‌ బస్సులకు మంగళం!

రద్దయిన నైట్‌హాల్ట్‌ సర్వీసులు

ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రయాణికులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ: ఇప్పటి వరకూ ఈనాడు - హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా ఉద్దెమర్రికి చెందిన సతీష్‌ తన పొలంలో పండిన ఆకుకూరలను వేకువజామున బస్సులో నగరానికి తెచ్చి విక్రయించి.. తిరిగి ఉదయం 10 గంటలకల్లా సొంతూరు చేరుకునేవాడు. ఇందుకు కేవలం అతడికి రూ. 50 నుంచి రూ. 60 ఖర్చు అయ్యేవి. ప్రస్తుతం సబర్బన్‌ బస్సులు తిరగడంలేదు. రాత్రిహాల్టు సర్వీసులూ ఉండడం లేదు. దీంతో రైతులు ఉదయాన్నే పాల క్యాన్లు, కూరగాయలను సొంత వాహనాల్లో లేదా ఆటో ట్రాలీల్లో తరలిస్తున్నారు. ఇందుకు ఒక్కో రైతుపై రూ. 150 నుంచి రూ. 200 భారం పడుతోంది. రవాణా ఛార్జీల భారం మోయలేక పంటను పొలం దగ్గరే దళారీలకు అమ్ముకోవాల్సి వస్తోంది. 

నగరంలోని మెహిదీపట్నం, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, అల్వాల్‌, ఫలక్‌నుమా రైతు బజార్లకు.. కనీసం మూడు చొప్పున బస్సులు కూరగాయలను తీసుకువచ్చేవి. కొన్నాళ్లుగా ఆ బస్సులు లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. గతంలోని నగర శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు సబర్బన్‌ బస్సులు రాత్రిపూట చివరి ట్రిప్పుగా వెళ్లి.. ఉదయాన్నే తిరిగి బయల్దేరేవి. ప్రతి డిపో నుంచి 20 నుంచి 30 సబర్బన్‌ సర్వీసులు గ్రామాలకు కనీసం 10 ట్రిప్పులు తిరిగేవి. దీంతో ఊళ్ల నుంచి నగరానికి కావాల్సిన కూరగాయలు, పళ్లు, పాలు సులభంగా చేరేవి. ఇప్పుడా బస్సులు లేకపోవడంతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

1100 బస్సుల కోత.. 

నగర శివార్లలోని పల్లెలకు వెళ్లే సబర్బన్‌ బస్సులే కాదు.. శివారు కాలనీలకు వెళ్లే సిటీ బస్సులు కూడా ఇప్పుడు రద్దయ్యాయి. వీటి సంఖ్య సుమారు 1100 వరకు ఉంటుంది. సొంత బస్సులు తిప్పితేనే ఆదాయం సమకూరడంలేదని చెబుతున్న ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌ అధికారులు.. ఇప్పుడు అద్దె బస్సులు సైతం తమకు భారం అని భావించారు. దీంతో పల్లెలకు తిరిగే 550 అద్దె బస్సులు రద్దయ్యాయి. మల్కాజిగిరిలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ తిరిగే 16ఈ బస్సు రెండుగంటలకోసారి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.127కేకే పేరుతో ఖానామెట్‌, కొండాపూర్‌ ప్రాంతాలను అనుసంధానిస్తూ తిరిగే బస్సు లేదు. 127 నందినగర్‌ బస్సు కూడా కనిపించడంలేదు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో..

గతేడాది బస్సుల సంఖ్య: 3750

ప్రస్తుతం తిరుగుతున్నవి: 2650

గ్రామీణ ప్రాంతాలకు నిలిచిన అద్దెబస్సులు: 550

ఒక్కో శివారు డిపో నుంచి రద్దయిన సర్వీసులు: 30


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని