ప్రతిసారి పాత్రధారులే.. మరి సూత్రధారులెక్కడ..?
eenadu telugu news
Updated : 06/08/2021 11:48 IST

ప్రతిసారి పాత్రధారులే.. మరి సూత్రధారులెక్కడ..?

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిసారి ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పాత్రధారులే చిక్కుతున్నారు. అసలు సూత్రధారులు మాత్రం దొరకడం లేదు. ఎస్వోటీ పోలీసులు బుకీలను అరెస్ట్‌ చేసి స్థానిక ఠాణాల్లో అప్పగిస్తున్నారు. స్థానిక పోలీసులేమో సదరు కార్యకలాపాలను ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారు..? దీని వెనుకున్నది ఎవరు..? అంటూ లోతుగా దర్యాప్తు చేయడం లేదు. ఇదీకాకుండా బెట్టింగ్‌ ముఠాలు సైతం పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి.

ప్రతి నగరంలో నమ్మిన బంటులు

గూగుల్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ అని కొడితే చాలూ.. పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు, యాప్‌లు దర్శనమిస్తున్నాయి. అయితే.. ఇక్కడ ప్రధాన సూత్రధారులు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఎవరికిపడితే వాళ్లకు నేరుగా లైన్‌(ఐడీ, పాస్‌వర్డ్‌) ఇవ్వరు. బాగా పరిచయమున్న వ్యక్తుల(బుకీ)కే ఇస్తుంటారు. వాళ్లతో కూడా నేరుగా మాట్లాడకుండా వాట్సాప్‌లోనే సంభాషిస్తుంటారు. ఆ నంబర్‌ కూడా ‘వర్చువల్‌ నంబర్‌’ అయి ఉంటుంది. ముంబయి, రాజస్థాన్‌లో ఉండి.. ఎక్కడో యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా నంబర్‌ను సృష్టిస్తున్నారు. పంటర్ల నుంచి డబ్బుల్ని నేరుగా తీసుకోరు. ప్రతి నగరానికి ఇద్దరు, ముగ్గుర్ని నమ్మిన బంట్లను బుకీలుగా నియమించుకుంటున్నారు. పంటర్ల నుంచి డబ్బులు సేకరించాక వాటిని తమకు చేరవేసే బాధ్యతను ఈ బుకీలకు అప్పగిస్తున్నారు.

‘హవాలా’ ద్వారానే డబ్భు.

సాధారణంగా ఎక్కువ శాతం కేసుల్లో బ్యాంకు ఖాతాల ద్వారా ఏదో ఆధారంగా పోలీసులకు చిక్కుతుంది. ఆ అవకాశం పోలీసులకు ఇవ్వకుండా బెట్టింగ్‌ ముఠాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. వర్చువల్‌ నంబర్లతో విదేశాల నుంచి దందా నడిపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. ఇదీ కాకుండా బుకీల నుంచి కూడా నేరుగా డబ్బులు తీసుకోరు. లావాదేవీలన్నీ కూడా ‘హవాలా’ ద్వారానే జరుగుతున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.

చిక్కని సోమన్న జాడ

ఐపీఎల్‌ మాదిరిగానే పాకిస్థాన్‌లో ‘పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)’ పేరిట ప్రత్యేక టోర్నమెంట్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నలుగురిని మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులు జూన్‌లో నిజాంపేటలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి ఏపీలోని తూర్పుగోదావరికి చెందిన సోమన్న పరారీలో ఉన్నట్లుగా గుర్తించారు. ఎక్కడో ఉండి లైవ్‌లైన్‌ గురు, క్రికెట్‌ మజ్జా, లోటస్‌, బెట్‌-365, బెట్‌ ఫెయిర్‌ తదితర యాప్‌ల ద్వారా రూ.వందల కోట్ల వరకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఏపీలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులతో సంబంధాలున్నట్లు ప్రచారం జరిగింది. అతడు చిక్కితే అసలు సంగతి బయటపడుతుందని అంతా భావించారు. తీరా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. తాజాగా రాచకొండ పోలీసులు సరూర్‌నగర్‌లో మరో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠాలో బుకీని మాత్రమే అరెస్ట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని