రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!
eenadu telugu news
Updated : 06/08/2021 12:41 IST

రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!

 నగర డ్రైన్లలో పడితే ఆచూకీ దొరకదు

సరిదిద్దేందుకు కేటాయించిన నిధులు మురుగుపాలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

తండ్రి జాడ కోసం డ్రైనేజీ గుంతలోకి చూస్తున్న అంతయ్య కుమారుడు

రాజధాని పరిధిలోని వర్షం నీటి నాలాలు, మురుగు డ్రైన్లలో పడితే కనీసం మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. వనస్థలిపురంలోని మ్యాన్‌హోల్‌లో పడి గురువారం రాత్రికి 48 గంటలైనా కూడా వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇది ఒక్క వనస్థలిపురంలో కాదు.. గత రెండేళ్లుగా మ్యాన్‌హోళ్లలో పడిన ఆరేడు మందిని గుర్తించడానికే కొన్ని రోజుల సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే విధితమవుతోంది. అయినా అధికారులు ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవడం లేదు.  
కోటి జనాభా దాటిన రాజధానిలో ఇప్పటికీ మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు అనుబంధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండటం లేదు. నిజాం కాలంలో ఒకవైపు వర్షం నీరు పోవడానికి నాలాలు మరోవైపు మురుగు పోవడానికి డ్రైన్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటులో కీలకమైంది మ్యాన్‌హోల్‌ నిర్మాణం. దీని దగ్గర మురుగునీరే కాకుండా పూడిక కూడా నెమ్మదిగా చేరుకునేలా నిర్మాణం ఉండాలి. నిజాం హయాంలో డ్రైన్లు, నాలాలు ఇలా శాస్త్రీయ పద్ధతిలోనే నిర్మించారు. ఆ తరువాత వివిధ ప్రభుత్వాల నిధులతో జరిగిన పనుల్లో కనీస ప్రమాణాలు పాటించలేదు. ఉదాహరణకు రాజేంద్రనగర్‌ పరిధిలో రూ.250 కోట్లతో, శేరిలింగంపల్లి పరిధిలో రూ.350 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో తాగునీటి పైపులైను, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. కానీ అస్తవ్యస్త పనుల వల్ల ఈ రెండు ప్రాంతాల్లో మురుగు సమస్యకు పరిష్కారం లభించలేదు. 

సరిదిద్దే ప్రణాళికే లేదు!

డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలంటే రూ.వేల కోట్ల అవసరం. అన్ని నిధులు ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం లేదు కాబట్టి తాము ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.500 కోట్లతో ఇప్పుడున్న వరదనీటి నాలాలు, మ్యాన్‌హోళ్లను సరిదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు. భూగర్భ నాలాలు కాకుండా ఓపెన్‌ నాలాలు, డ్రైన్లు ఉన్నాయి. వీటి దగ్గర కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

నాలాలు, డ్రైన్లు కలగలిసిపోయాయి

నిజాం కాలంలో శాస్త్రీయ విధానంలో వరద నాలాలు, మురుగునీటి వ్యవస్థ ఏర్పడిందని,  ఆ తరువాత ఈ రెండింటిని కలిపేయడం వల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొందని జలమండలి మాజీ ఈడీ రామేశ్వరరావు అన్నారు. రెండు వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని,  ఇలేనే వదిలేస్తే మురుగే ప్రధాన సమస్యగా మారుతుందన్నారు.

మురుగుకు.. మోక్షం!

ఈనాడు, హైదరాబాద్‌: తొలి విడతలో కొత్త మురుగు శుద్ధి కేంద్రాల(ఎస్టీపీల) నిర్మాణానికి అడుగు పడింది. ఫతేనగర్‌ వద్ద 100 మిలియన్‌ లీటర్ల మురుగు శుద్ధి చేసేందుకు నిర్మించ తలపెట్టిన ఎస్టీపీ పనులకు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు.  గ్రేటర్‌ వ్యాప్తంగా మూడు దశల్లో 62 ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి(ఎస్టీపీలు) నిర్మించడానికి గతంలో జలమండలి ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతగా రూ.1,280 కోట్లతో 17 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి స్థలాల ఎంపిక భూసేకరణ ఒక కొలిక్కి వచ్చింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు జలమండలి పరిధి విస్తరించింది. అక్కడ వరకు తాగునీటిని సరఫరా చేస్తోంది.


అంతయ్య ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

హయత్‌నగర్‌లో మ్యాన్‌హోల్‌ను పరిశీలిస్తున్న సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: డ్రైనేజీ పూడికతీత తీసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన   అంతయ్య ఆచూకీ గురువారం రాత్రి వరకు లభించలేదు. ఉదయం నుంచే సహాయక చర్యలను కొనసాగించారు.  మొత్తం మూడు మ్యాన్‌హోళ్ల వరకు దాదాపు 300 మీటర్ల దూరాన్ని యంత్రాలతో తవ్వారు. మ్యాన్‌హోళ్ల లోతు 15 అడుగులు ఉండటంతో వాటిని తవ్విన ప్రదేశంలో బావిలాంటి గుంతలు ఏర్పడ్డాయి. అక్కడి పైపులను సైతం బయటకు తీశారు. మూడు మ్యాన్‌హోళ్ల దూరంలో ఎక్కడా గల్లంతైన వ్యక్తి ఆచూకి లభించలేదు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి  అధికారులతో కలిసి కుంట్లూరు సమీపంలోని పసుమాముల చెరువులో పడవలను తెప్పించి వెతికించారు. పద్మావతి బ్యాంకు కాలనీ నుంచి ఉన్న పైపులు  సామనగర్‌ ట్రంకులైనుకు కలుస్తుంది. గల్లంతైన వ్యక్తి అందులోకి వెళితే అక్కడి నుంచి కుంట్లూరు మీదుగా పసుమాముల చెరువుకు ఈ లైను కలుస్తుంది. దీంతో చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు.

రూ.135 కోట్లతో నాలాల వ్యవస్థ: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే 

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో రూ.135 కోట్ల అంచనాలతో వర్షం నీరు పోయేందుకు  నాలాలను నిర్మించాలని తలపెట్టాం. మొదటి దశగా రూ.105 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తే  పనులను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాô.  మంగళవారం దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని