కరోనా కాదా.?.. డెంగీ కావచ్చు!
eenadu telugu news
Updated : 27/08/2021 13:27 IST

కరోనా కాదా.?.. డెంగీ కావచ్చు!

విషజ్వరాల బారిన వైద్యులు, సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఆసుపత్రిలో 30-40 మంది డెంగీతో చికిత్స పొందుతున్నారు. కొందరు జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో సొంత వైద్యం చేసుకుంటున్నారు. కరోనాగా అనుమానించి యాంటీకాగ్‌లెంట్‌(రక్తం గడ్డకుండా ఉండేందుకు) మందులు వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటే.. అదే డెంగీలో ప్లేట్‌లెట్లు తగ్గి రక్తం పలుచబడుతుంది. డెంగీ ఉన్నప్పుడు కొవిడ్‌గా అనుమానించి ఈ మందులు తీసుకుంటే తీవ్ర రక్తస్రావమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గత వారం రోజుల్లో నగరంలో డెంగీ కేసులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం 70-80 మంది కరోనా బారిన పడుతున్నారు. కొవిడ్‌కు, డెంగీకి మధ్య తేడా గుర్తించి మందులు వాడాలని సూచిస్తున్నారు.

కొవిడ్‌ లక్షణాలివీ

* కరోనాలో జ్వరం, గొంతునొప్పి, జలుబు, ఒళ్లు నొప్పులుంటాయి. తెల్లరక్త కణాలు తగ్గుతాయి.

* ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోతుంది.
* కరోనా సోకిన రెండు, మూడు రోజుల్లో వాసన, రుచి కోల్పోతారు.
* ఎక్స్‌రే, సిటీస్కాన్‌లో ఊపిరితిత్తుల్లో వైరల్‌ న్యూమోనియా ఉంటుంది.

డెంగీ లక్షణాలివీ

* దోమ కుట్టిన 2-14 రోజుల్లో సోకుతుంది. 102 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది.

* తీవ్ర తలనొప్పి, కంటి వెనుక నొప్పితోపాటు భారీగా ఒళ్లు నొప్పులుంటాయి.

* ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్స్‌ చేరుతాయి. పిత్తాశయం గోడలు వాచి, పొట్టలో నీళ్లు చేరతాయి.

* తెల్లరక్తకణాలు బాగా తగ్గుతాయి. ప్లేట్‌లెట్స్‌ పడిపోతాయి.

* రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. రక్తపోటు 130/80 కంటే బాగా పడిపోతుంది.

* శరీరంపై ర్యాషెష్‌తోపాటు చర్మంపై రక్తపు మచ్చలు కన్పిస్తాయి.  


వైద్యులు ఏమంటున్నారు

* డెంగీగా భావిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. ప్లేట్‌లెట్స్‌, తెల్లరక్తకణాలు తగ్గినా...హిమోగ్లోబిన్‌ పెరిగినా డెంగీగా అనుమానించి వైద్యులను సంప్రదించాలి.

*  డెంగీ, కరోనా కాకపోతే మలేరియాగా అనుమానించి పరీక్షలు చేసుకోవాలి

*  తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లాంటివి అయిదు రోజులకంటే ఎక్కువ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి.

*  తవిటిపురుగు కుట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. డెంగీ లక్షణాలే కన్పిస్తాయి. వైద్యులను సంప్రదిస్తే ఈ తేడాలను గుర్తించొచ్చు.

*  డెంగీలో 20 వేల కంటే ప్లేట్‌లెట్స్‌ తగ్గి రక్తస్రావమవుతుంటే బయట్నుంచి ఎక్కిస్తారు. 50-60 వేలు ఉండగానే ఎక్కించాల్సిన అవసరం లేదు.

  ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో అనేకమంది వైద్యులు, సిబ్బంది డెంగీ బారిన పడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రి సీనియర్‌ వైద్యుడికి డెంగీ వచ్చి ప్లేట్‌లెట్లు 50 వేల వరకు తగ్గిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య లోపం దోమల విజృంభణకు కారణంమవుతోంది. ఉస్మానియా, గాంధీలో బెడద తీవ్రంగా ఉంది. ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యురాలు డెంగీతో కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రికి నిత్యం 10-20 మంది డెంగీ లక్షణాలతో వస్తున్నారు. ఉస్మానియాలోనూ అదే పరిస్థితి. వార్డుల్లో పరిశుభ్రత లేకపోవడం.. ఫ్యాన్లు తిరగకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు. నిమ్స్‌లో చేరుతున్న రోగులు కొందరు ఫ్యాన్లు వెంట తెచ్చుకుంటున్నారు. తక్షణమే దోమల నివారణ చర్యలు చేపట్టాలని, లేదంటే వైద్యులు, సిబ్బంది ఆసుపత్రుల పాలైతే రోగులకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని