తొక్కిసలాట లేకుండా.. టోకెన్‌తో రైలులోకి
eenadu telugu news
Updated : 15/09/2021 04:16 IST

తొక్కిసలాట లేకుండా.. టోకెన్‌తో రైలులోకి

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు బారులుతీరి నిలబడాల్సిన అవసరం లేకుండా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది. ఇందుకోసం బయోమెట్రిక్‌ టోకెన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను మంగళవారం ద.మ. రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఈశ్వరరావు, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ ఏకే గుప్తా ప్రారంభించారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారు టిక్కెట్‌ తీసుకుని బయోమెట్రిక్‌ యంత్రంలో వేలు ముద్రలివ్వాల్సి ఉంటుంది. ప్రయాణికుడి పేరు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రయాణిస్తున్నారనే వివరాలు నమోదు చేయడంతోపాటు.. ఫొటోగ్రాఫ్‌ కూడా తీసుకుంటారు. ఈ సమాచారం సేకరించిన తర్వాత ఒక నంబరుతో టోకెన్‌ ఇస్తారు. అందులో వారు ప్రయాణించాల్సిన రైలుతో పాటు కోచ్‌ వివరాలుంటాయి. దాని ప్రకారం వారికి కేటాయించిన జనరల్‌ కోచ్‌లోనే రైలు ఎక్కాల్సి ఉంటుంది. 15 నిమిషాల ముందు వచ్చి ఆ టోకెన్‌ను సిబ్బందికి చూపించి రైలు ఎక్కొచ్చని సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం ఏకే గుప్తా చెప్పారు. తొక్కిసలాట లేకుండా సులభంగా రైలు ఎక్కడానికి ఈ విధానం దోహదపడుతుందని ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని