Crime News: చెప్పు కోసం వెళ్లిన ఏడేళ్ల బాలుడు.. తిరిగిరాని లోకాలకు
eenadu telugu news
Published : 15/09/2021 08:43 IST

Crime News: చెప్పు కోసం వెళ్లిన ఏడేళ్ల బాలుడు.. తిరిగిరాని లోకాలకు

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: పది నిమిషాలు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన మనవడు చెరువులో పడి విగతజీవిగా మారడంతో ఆ పెద్దవారు బోరున విలపించిన తీరు చూసి కంటతడి పెట్టని వారు లేరు. ఈ ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలోని తట్టిఅన్నారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం,రాంపురానికి చెందిన రావుల వాసుదేవ్‌రెడ్డి, సుజన దంపతులు 15 ఏళ్లుగా తట్టిఅన్నారం హనుమాన్‌ నగర్‌లో ఉంటున్నారు. వాసుదేవ్‌రెడ్డి కుమారుడు ధీరజ్‌రెడ్డి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే ముంబయిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ధీరజ్‌రెడ్డి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. కుమారుడు రిశిక్‌రామ్‌రెడ్డి(7)ని తల్లి, తండ్రి వద్ద ఉంచిన ధీరజ్‌ అప్పుడప్పుడూ వచ్చిపోయేవాడు. బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు.
పాకురుగా ఉండడంతో..
బాలుడు మంగళవారం మధ్యాహ్నం ఇదే కాలనీలో ఉంటున్న మేఘనాథ్‌ అనే స్నేహితుడితో కలిసి ఆడుకునేందుకు వెళ్లాడు. కాలనీకి సమీపంలోనే చెరువు ఉండడంతో సైకిల్‌ తొక్కే క్రమంలో రిశిక్‌రామ్‌రెడ్డి చెప్పు జారి అందులో పడింది. తీసేందుకు ప్రయత్నిస్తుండగా పాకురు ఉండడంతో ఇద్దరూ జారి చెరువులో పడిపోయారు. రిశిక్‌రామ్‌రెడ్డి మునిగిపోగా.. మేఘనాథ్‌ కంప చెట్టును పట్టుకుని ఉండిపోయాడు. కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాడు సాయంతో చెరువులోకి దిగి మేఘనాథ్‌ను రక్షించారు. రిశిక్‌రామ్‌రెడ్డి తీసేలోపే మృతిచెందాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని