స్వయం ఉపాధికి బాటలు
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

స్వయం ఉపాధికి బాటలు

రాయితీ రుణాల అందజేతకు అధికారుల కసరత్తు

బ్యాంకు సమ్మతి తప్పనిసరి చేసిన ఎస్సీ కార్పొరేషన్‌

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌

ముఖాముఖికి వచ్చిన లబ్ధిదారులు

న్నత చదువులు చదివినా గ్రామీణ యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న ఊరిలో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. నైపుణ్య యూనిట్లకు సంబంధించి పత్రాల పరిశీలన సైతం పూర్తయింది. జిల్లా స్థాయిలో ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసినా, వీరిలో అర్హత ఉన్న వారికే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు నైపుణ్య అర్హతల ఆధారంగా లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నం అయ్యారు.

జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాల కోసం 300 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించారు. రూ.12 కోట్ల వ్యయంతో బ్యాంకు అనుసంధాన రాయితీ రుణాలు అందజేస్తారు. నైపుణ్యంతో సంబంధం లేని యూనిట్లకు మండలాలు, పురపాలికల వారీగా అర్జీలను పరిశీలించి ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తారు. నైపుణ్యంతో కూడిన యూనిట్లకు జిల్లా స్థాయిలోనే ఎంపిక నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నం అయ్యారు. నైపుణ్యంతో సంబంధం లేని యూనిట్లకు మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

అధిక సంఖ్యలో లబ్ధిదారులు

నైపుణ్యంతో సంబంధం ఉన్న యూనిట్లకు జిల్లా స్థాయిలో ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. 5,776 మంది ఈ కేటగిరి యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటీ వరకు 3,800 మందికి ఈ ప్రక్రియ పూర్తిచేసి 3071 మందిని ఎంపిక చేశారు. వీరిలో మళ్లీ అర్హత ప్రకారం గుర్తించిన వారు బ్యాంకు అంగీకార పత్రం తీసుకు రావాల్సి ఉంటుందని, వాటిని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సమర్పించాలని సూచిస్తున్నారు.

తప్పని ఎదురు చూపులు

బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే లబ్ధిదారులుగా ఎంపికైనా ఉపయోగం ఉండటం లేదు. రాయితీ రుణం మంజూరు అయ్యేందుకు బ్యాంకు సమ్మతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు నిరుద్యోగులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులుగా ఎంపికైన వారిని నిరాశకు గురిచేయకుండా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే యువత స్వయం ఉపాధికి బాటలు పడనున్నాయి. లేని పక్షంలో ఎదురు చూపులు తప్పడం లేదు.

పారదర్శకంగా ఎంపికలు : బాబుమోజస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. జిల్లా స్థాయిలో ముఖాముఖి నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. రుణాల మంజూరుకు బ్యాంకు అధికారుల సమ్మతి పత్రం తప్పనిసరి. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని