ప్రజలకు జవాబుదారీగా ఉండటమే లక్ష్యం
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

ప్రజలకు జవాబుదారీగా ఉండటమే లక్ష్యం

ప్రశ్నించారని ఇబ్బంది పడొద్దు

ఎంపీ రంజిత్‌రెడ్డి

ప్రసంగిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి,

ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య, మహేష్‌రెడ్ఢి కలెక్టర్‌ నిఖిల

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: పల్లెలకు వెళ్లినపుడు ప్రజలు తమ సమస్యలను మనకు విన్నవించాలని ప్రయత్నం చేస్తున్నారు.. మరికొందరు నిలదీస్తున్నారు.. వారికి ప్రశ్నించే హక్కు ఉంది, అలాగని మనం ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికే కృషి చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా రిసోర్స్‌ భవనంలో ‘దిశ’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రజలకు జవాబుదారీగానే ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్నా, ఇంకా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షిస్తూ, కేంద్రానికి రూ.100 పన్ను చెల్లిస్తే, అందులో రూ.40 తిరిగి రాష్ట్రానికి కేటాయిస్తోంది. ఈ నిధులకు, రాష్ట్రంలో మరికొన్ని కలిపి సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్తు శాఖ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను ఆరా తీయగా, పర్యవేక్షక ఇంజినీరు హాజరు కాలేదని సిబ్బంది చెప్పారు. 2,400 భూసార పరీక్షలు నిర్వహించి, వాటి నివేదికలను రైతులకు అందించామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్‌ తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకుండా కొంత మంది గుత్తేదారులు డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు, మరికొంత మంది నిర్మించినా, వాటిని వినియోగించడం లేదని మండల పరిషత్తు అధ్యక్షులు సభదృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం పనిదినాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్‌డీఓ కృష్ణన్‌ తెలిపారు. రైతు వేదికలకు అదనపు చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను కోరారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనలో ఏడాదికి వంద కిలోమీటర్ల పొడవునా రహదారుల నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఎంపీ ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వడంలో జిల్లా అధికారులు వెనుకబడ్డారని, నెహ్రూ యువ కేంద్రంతో కలసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించగలమని ఎంపీ సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదయ్య, కలెక్టర్‌ నిఖిల, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల పరిషత్తు అధ్యక్షులు పాల్గొన్నారు.

సమావేశ నిర్వహణపై ఎంపీ అసహనం: వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీ రంజిత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిర్వహణ ఇలాగేనా అంటూ డీఆర్‌డీఓ కృష్ణన్‌ను ప్రశ్నించారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బంట్వారం, న్యూస్‌టుడే: మండలంలోని యాచారంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా కుటుంబానికి మేలు జరిగేలా కృషి చేస్తామన్నారు.

తెరాస హయాంలోనే రైతుల అభివృద్ధి: తెరాస హయాంలోనే రైతులు అభివృద్ధి చెందారని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తొర్మామిడి, బంట్వారం గ్రామాల్లో రైతువేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు అందించేందుకే వీటిని నిర్మించారన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మల్లేశం, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

నూతన విధానాలతో మేలు

మర్పల్లి, న్యూస్‌టుడే: ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా, ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ఎంపీ రంజిత్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం మండల కేంద్రంలోని విపణి ఆవరణలో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపణి విధానాలతో అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రావులపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి తెరాసలో చేరారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు లలిత, జడ్పీటీసీ మధుకర్‌, విపని ఛైర్మన్‌ మల్లేశం, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌గుప్తా, రామేశ్వర్‌ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని